ఇంటికే భద్రాద్రి కల్యాణ తలంబ్రాలు

– ముందస్తు బుకింగ్‌తో అధికారుల ఏర్పాట్లు
– అన్‌లైన్‌ ‌బుకింగ్‌ ‌ద్వారా అందుబాటులో సేవలు

భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 14: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీరామనవమి ప్రధానమైనది. ‘దక్షిణ అయోధ్య‘గా ప్రసిద్ధి చెందిన భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో నిర్వహించే కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి రోజున నిర్వహించే ఈ వార్షిక కల్యాణ వేడుకను కళ్లారా వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. రామదాసు కీర్తనలతో మార్మోగే భద్రాద్రి గిరులు, గోదావరి నది తీరాన జరిగే ఈ అద్భుత ఘట్టం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఏడాది మార్చి 19న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 2 ‌వరకు వైభవంగా సాగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ఈసారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తుల కోసం టికెట్‌ ‌బుకింగ్‌ , ‌రాలేని భక్తుల కోసం ఇంటికే తలంబ్రాలను పంపే వినూత్న ఏర్పాట్లు కూడా సిద్ధమయ్యాయి. ఈ మహోత్సవంలో అత్యంత ముఖ్యమైన శ్రీ సీతారాముల వార్షిక కల్యాణం మార్చి 27న జరగనుండగా, మరుసటి రోజు అనగా మార్చి 28న శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. భక్తులు ఈ పవిత్ర కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి ఆలయ అధికారులు ప్రత్యేక సెక్టార్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం భక్తులు భద్రాచలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ ‌ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ ‌చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌ ‌హోమ్‌ ‌పేజీలోని ‘శ్రీరామనవమి టికెట్‌‘ ‌లింక్‌పై క్లిక్‌ ‌చేసి, తమకు నచ్చిన కళ్యాణం లేదా పట్టాభిషేకం సెక్టార్‌ను ఎంచుకుని నిర్ణయించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ‌సదుపాయం లేని వారు మార్చి 15 నుంచి భద్రాచలం రామాలయ ప్రధాన కౌంటర్‌, ‌తానీషా కళ్యాణ మండపం, గోదావరి బ్రిడ్జీ వద్ద ఉన్న దేవస్థానం విచారణ విభాగం లేదా భద్రాచలం సబ్‌ ‌కలెక్టర్‌ ‌కార్యాలయం ద్వారా నేరుగా టికెట్లు పొందవచ్చు.
దూర ప్రాంతాల్లో ఉండి భద్రాచలానికి రాలేని భక్తుల కోసం కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు ఆన్‌లైన్‌ ‌ద్వారా రూ. 5,000 లేదా రూ. 1,116 టికెట్లు బుక్‌ ‌చేసుకుంటే, వారి గోత్ర నామాలతో ఆలయంలో కళ్యాణం నిర్వహిస్తారు. అంతేకాకుండా, స్వామివారి ముత్యాల తలంబ్రాలను భక్తుల ఇళ్లకే చేర్చేందుకు లాజిస్టిక్స్ ‌విభాగం ప్రత్యేక సేవలను అందిస్తోంది. రూ. 151 చెల్లించి సమీప ఆర్టీసీ కౌంటర్లలో లేదా ఆన్‌లైన్‌ ‌ద్వారా తలంబ్రాలను బుక్‌ ‌చేసుకుంటే, ఉత్సవాల అనంతరం వాటిని ఇంటికే డెలివరీ చేస్తారు. ఈ ఏడాది సుమారు 5 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు, 2 లక్షల చిన్న లడ్డూలు, 3 వేలకు పైగా మహా లడ్డూలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా తెలంగాణ , ఆంధప్రదేశ్‌ ‌రోడ్డు రవాణా సంస్థలు వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *