భద్రాచలం ఆల‌య‌ అభివృద్ధికి మాస్టర్‌ ‌ప్లాన్‌

– మూడు దశల్లో దేవస్థానం అభివృద్ధి పనులు
– మాస్టర్‌ ‌ప్లాన్‌పై చర్చించిన మంత్రులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 20: ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధికి  ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, వాకాటి శ్రీహరి అన్నారు. భద్రాద్రిని ఒక అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉందని వెల్లడించారు.  భద్రాచలం ఆలయ రూపురేఖలను మార్చేలా  రూపొందించిన మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌పై శుక్రవారం నాడు సచివాలయంలోని మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 200 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని  ఆగమ శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలకు అనుగుణంగా మూడు దశల్లో ఆలయాన్ని అభివృద్ది చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డితో చర్చించిన తర్వాత మాస్టర్‌ ‌ప్లాన్‌కు తుది రూపునివ్వాలని సమావేశంలో నిర్ణయించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యేనాటికి భద్రాచలంలో పుష్కర ఘాట్‌తోపాటు మొదటి దశ ఆలయ అభివృద్ది పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తామన్నారు. భద్రాచలం సమీపంలోని రామవరంలో ట్రైబల్‌ ‌మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గోదావరి పుష్కరాలలో భాగంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కొరివి వీరభద్రస్వామి దేవాలయం, మల్లూరు లోని నరసింహాస్వామి దేవాలయాలను కూడా అభివృద్ది చేయాలని సూచించారు. సమావేశంలో పార్లమెంట్‌ ‌సభ్యులు బలరాం నాయిక్‌, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *