మెరుగైన పాల‌న యూడీఎఫ్‌తోనే సాధ్యం

– ఎన్నికల హామీల అమలులో ఎల్డీఎఫ్ విఫలం
– తెలంగాణలో హామీలు అమలు చేస్తున్నాం
– వృద్ధుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ
– కేరళం ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: కేరళం రాష్ట్రంలో గొప్ప మార్పు కోసం, మెరుగైన సంక్షేమం కోసం, సుపరిపాలన, సెక్యులర్ పాలన కోసం ఈనెల 9న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆ రాష్ట్రంలోని పతనంతిట్ట నియోజకవర్గంతోపాటు పలు ప్రాంతాల్లో శనివారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గత ఎన్నికల ముందు ఎల్‌డీఎఫ్ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. పరిపాలన దారుణంగా పడిపోయిందని, శబరిమల ఆలయంలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలున్నాయని, నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందని, పొట్ట చేత పట్టుకొని కేరళం యువత ప్రపంచం నలుమూలలకు వలస పోతుండగా ఇక్కడ వారి సీనియర్ సిటిజన్స్‌కు సరైన సంక్షేమం, ఆదరణ లేకుండా పోయిందని భట్టి విక్రమార్క విమర్శించారు. కేరళం అంటే సెక్యులరిజం, ఉన్నత విద్యావంతులు, గొప్ప మానవీయ కోణం ఉంటుందని అంతా భావిస్తాం కానీ ఈరోజు ఆ తరహా పరిస్థితులు కనిపిం#డంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళం అంటే కమ్యూనిజం, మార్క్సిజం గురించి మాట్లాడతారు కానీ నేడు అది పక్కకు పోయి గూండాయిజం మాత్రమే కనిపిస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌వాదులు శాంతికాముకులు, సుపరిపాలన, సెక్యులరిజాన్ని కోరుకుంటారని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈ రెండేళ్ల కాలంలో దాదాపు అన్నీ అమలు చేశామని ఆర్థిక మంత్రిగా స్పష్టంగా లెక్కలతో వివరిస్తానని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని, ఎవరికైనా అనుమానం ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించి నివృత్తి చేసుకోవచ్చంటూ ఆయా పథకాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు, విద్యపై ఎక్కువ ఖర్చు చేస్తున్నామని కేరళం సీఎం ప్రకటించుకుంటున్నారు కానీ ఈరోజు తెలంగాణలో విద్యపైన అత్యధికంగా ఖర్చు చేస్తున్నామని డిప్యూటీ సీఎం వివరించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను 25 ఎకరాల్లో Áఒక్కొక్కటి రూ.200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడ విద్య, వసతి అన్నీ ఉచితంగా అందజేస్తామని తెలిపారు. కేరళంలో యూడీఎఫ్‌ను అధికారంలోకి తీసుకొస్తే కాలేజీ విద్యార్థినులకు నెలకు రూ.1000 చొప్పున అందజేస్తామని, స్వయం ఉపాధి కోసం యువతకు వడ్డీ లేకుండా రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. సామాజిక పెన్షన్‌ను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని, ప్రజల సీఎంగా పేరుగాంచిన కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ పేరిట వృద్ధుల కోసం రూ.25 లక్షల బీమా పథకాన్ని తీసుకొస్తామని తెలిపారు. ఉపాధి కోసం యూడీఎఫ్ అధికారంలోకి రాగానే సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి వారి సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని, ఇళ్ల వద్ద ఉన్న పెద్దలను జాగ్రత్తగా చూసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యుడు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *