మేలైన విద్య, మెరుగైన వసతులే ప్రామాణికం

– ఇంజినీరింగ్‌ ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం యోచన
– ఆయా అంశాల అధ్యయనానికి కమిటీ నియామకం
– నిర్దేశిత సమయంలోనే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ 

హైదరాబాద, ప్రజాతంత్ర, జూన్‌ 27: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజుల నియంత్రణపై హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా కళాశాలల్లో బోధన సిబ్బంది, బోధనస్థాయి, కళాశాలల్లో ల్యాబ్‌లు, భవనాలు ఇతర వసతులు.. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలనే భావనలో ప్రభుత్వం ఉంది. కృత్రిమ మేధ (ఏఐ) వంటి కోర్సులు సాంకేతిక రంగంపై బలమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో తెలంగాణలోని ఇంజినీరింగ్‌ కళాశాలలు ప్రపంచస్థాయి ప్రమాణాలతో పోటీపడేలా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. మార్కెట్‌ అవసరాలకు తగినట్లు కళాశాలలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ప్రణాళికబద్ధంగా ముందుకువెళ్లేలా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో మెరుగైన వసతులు, బోధన సిబ్బంది, ల్యాబ్‌లు.. ఏఐసీటీఈ మార్గదర్శకాలకనుగుణంగా ఉండాలని ఆశిస్తున్నారు. ఫీజుల నిర్ణయానికి వీటినే ప్రాతిపదిక తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫీజుల నిర్ణయానికి సంబంధించి ఇస్లామిక్‌ అకాడమీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ వర్సెస్‌ కర్ణాటక, పీఏ ఇనాందార్‌ అండ్‌ అదర్స్‌ వర్సెస్‌ మహారాష్ట్ర కేసుల్లో ఆయా కళాశాలల్లోని వసతులు, ల్యాబ్‌లు, లెక్చరర్లకు ఆ సంస్థ ఇచ్చే వేతనాలు, బోధన, బోధనేతర సిబ్బంది, కళాశాల భవిష్యత్‌ ప్రణాళికలు, కళాశాల ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రాతిపదిక చేసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫీజుల నిర్ణయంలో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రం నిర్ణయించింది. ఇంజినీరింగ్‌ కళాశాలల్లో వసతులు, బోధన సిబ్బంది.. ఇతర వ్యవహారాలపై గత ప్రభుత్వం విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖతో తనిఖీలు చేయించింది. ఆ శాఖ క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి నివేదిక రూపొందించింది. కానీ గత ప్రభుత్వం ఆ నివేదికపై ఎలాంటి చర్య తీసుకోలేదు. కానీ తమకు నచ్చిన కళాశాలలకు ఫీజులు పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ నివేదిక పరిశీలనతోపాటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో అందుతున్న విద్యా ప్రమాణాలను మదింపు చేసి ఫీజులపై నిర్ణయం తీసుకునేందుకు ఒక కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ప్రక్రియను నిర్దేశిత సమయంలోనే పూర్తిచేయాలని కూడా నిర్ణయించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *