– ఏసీబీ ఉచ్చులో వరుసగా పోలీస్ అధికారులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: “యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు.. శాంతిభద్రతలను కాపాడవలసిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవు” అంటూ బాధ్యతలు చేపట్టిన వెంటనే డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి రాసిన లేఖలో అత్యంత స్పష్టంగా హెచ్చరించారు. హోమ్ గార్డు నుంచి ఐపీఎస్ అధికారి వరకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో, పారదర్శకతతో పనిచే యాలని, పోలీస్ స్టేషన్లకు వచ్చే పేదలు, బలహీన వర్గాల పట్ల సానుభూతితో వ్యవహరించి వారికి న్యాయం
చేయాలని డీజీపీ తన లేఖలో ఉద్ఘాటించారు. పోలీస్ స్టేషన్లను సివిల్ సెటిల్మెంట్లకు వేదికగా మార్చవద్దని, క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది
లేదని చెప్పారు. అయితే డీజీపీ స్థాయి అధికారి ఇంతటి కఠిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారులు తమ
పాత పద్దతులను మార్చుకోవడం లేదనే విషయం ఏసీబీ వరుస దాడులతో స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారు
సిన్హా పర్యవేక్షణలో అవినీతి నిరోధక శాఖ రాష్ట్రవ్యాప్తంగా తన వేగాన్ని పెంచింది. తాజాగా, శంషాబాద్ లోని ఆర్జీఐ ఎయిర్ పోర్ట్ పోలీస్
అవుట్ పోస్టులో ఇన్ స్పెక్టర్ సంపాతి కనకయ్య, ఎస్సై యు.కె.సిద్ధేశ్వర్ ఒక కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు, నిందితుల కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ నివాసంలో సోదాలు చేయగా ఏకంగా రూ.33,97,000 నగదు లభ్యమైంది. వీరిని బుధవారం రిమాండ్ కు తరలించారు. మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు ఆర్మ్ డ్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు ప్రమోద్ గౌడ్, జాతావత్ బాబు
నాయక్ ఒక సైబర్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ.లక్ష లంచం తీసుకుంటూ దొరికిపోయారు. నిర్మల్ జిల్లా మామడ ఎస్పీ అశోక్ తనపై ఉన్న ఫిర్యాదును మాఫీ చేసేందుకు రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడగా మాదాపూర్ ఎస్సై గాండ్ర వినయ్ నోటీసులు ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్ చేసి ఏసీబీ వలలో చిక్కారు. వరంగల్ లోని కేయూసీ ఎస్సై పి.శ్రీకాంత్ సీజ్ చేసిన వాహనాల విడుదల కోసం తన ప్రైవేట్ డ్రైవర్ ద్వారా రూ.15 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని ములుగు ఎస్సై విజయ్ కుమార్ రూ.50 వేలు, మెదక్ జిల్లా టేక్మల్ ఎస్సై రాజేష్ నోటీసుల జారీ కోసం రూ.30 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. టేక్మల్ ఎస్పి అయితే ఏసీబీ అధికారులను చూసి పొలాల్లోకి పారిపోగా అధికారులు వెంటాడి పట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా పోలీసు సిబ్బంది తమ పనితీరును మార్చుకొని, డిజిపి తన లేఖలో ఆశించినట్లు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




