ఆమనగల్లు బంద్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ
సోషల్ మీడియాలో కరపత్రం వైరల్ చేయడమే ఇందుకు కారణం
కేంద్ర, రాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాల ఆరా…!
ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ఉధృతం అవుతుంది. ఎక్కడో జరిగిన చిన్న సంఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. ఆమనగల్లు పట్టణానికి చెందిన స్థానిక వ్యాపారులు మార్వాడీలతో చేసుకున్న అంగీకారం ఉల్లంఘించడంతో ఈనెల 18న ఆమనగల్లు పట్టణానికి చెందిన కిరాణా, వస్త్ర, వర్తక సంఘం, స్వర్ణకార సంఘాల నాయకులందరూ మన ప్రాంతం మన వ్యాపారం అంటూ బంద్ కు పిలుపునిచ్చారు. దీనికి సోషల్ మీడియాలో బంద్ కు సంబంధించిన కరపత్రం వైరల్ చేయడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది ఇలా ఉంటే ఇటీవల సికింద్రాబాద్ నగరంలో జరిగిన ఓ సంఘటన దీనికి తోడవడంతో దృష్టి మొత్తం ఆమనగల్లు బంద్ పై పడింది.. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే ఆమనగల్లు పట్టణంలో గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మార్వాడీలు గిరివి దుకాణాలు, కిరాణా షాపులు, స్వీట్స్, హార్డ్వేర్ తో పాటు అన్ని రకాల వ్యాపారాలను ప్రారంభించారు. దీన్ని స్థానిక వ్యాపారస్తులు తీవ్రంగా ఖండిస్తూ అప్పట్లోనే ఓ అంగీకారానికి వొచ్చారు. ప్రస్తుతం ఆమనగల్ పట్టణంలో 10 కి పైగా మార్వాడి దుకాణాలు ఉన్నాయి. దీనికి మించి దుకాణాలు పెట్టవద్దని మార్వాడీలు స్థానిక వ్యాపారస్తులతో అంగీకారం కుదుర్చుకున్నారనీ సమాచారం. ఇటీవల ఓ మార్వాడి వ్యాపారి కల్వకుర్తి వైపు నూతనంగా ఓ దుకాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు దీనిని స్థానిక వ్యాపారులు వ్యతిరేకించి అడ్డు తగిలినట్లు సమాచారం. గతంలో వొచ్చిన మార్వాడీలతో జరిగిన అంగీకారం ఉల్లంఘించడంతో స్థానిక వ్యాపారస్తులందరూ ఒక్కతాటి పై వొచ్చి బంద్ కు పిలుపునివ్వడం అందుకు సంబంధించి కరపత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేయడం వల్ల కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో ఆమనగల్లు కు సంబంధించిన చిన్న సమస్యను మార్వాడి గో బ్యాక్ అనే నినాదంతో జోడించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దృష్టి ఆమనగల్ పై పడింది. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ఇంటిలిజెన్స్ వర్గాలు ఈ విషయమై అరా తీసినట్లు సమాచారం. ఈనెల 16, 17 తేదీలలో స్థానిక వ్యాపారస్తులు మార్వాడీలు ఆమనగల్ పోలీస్ స్టేషన్ లో చర్చలు జరిపి అంగీకారానికి వొచ్చారు. దీంతో ఈనెల జరగవలసిన బంద్ స్థానిక వ్యాపారస్తులు వాయిదా వేసుకున్నారు. ఆమనగల్లు మండలంలో ప్రశాంత వాతావరణంలో ఇరువురు వ్యాపారస్తులు తమ తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.





