అత్యధిక ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలి

– వడగాడ్పులు వీచే అవకాశం
– వైద్యారోగ్య శాఖ హెచ్చరిక

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 7: రాష్ట్రంలో మార్చి మొదటి వారంలోనే ఎండలు మండుతుండగా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్రమైన ఎండలతోపాటు వడగాడ్పులు వీచే అవకాశమున్నదని తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2`3 డిగ్రీలు పెరగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచించింది. తరచుగా తగిన మోతాదులో నీరు తాగాలని, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రయాణాలను తగ్గించుకోవాలని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, భద్రాద్రి`కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ వాతావరణ కేంద్రం రెడఅలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రత 39 నుంచి 41 డిగ్రీలకు చేరిందని, రాబోయే నాలుగు రోజులు ఇవే గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో కూడా గతంలో కంటే భిన్నంగా మార్చిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37`38 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఆదిలాబాద్ అర్బన్, ధర్మపురి, ఖమ్మం అర్బన్ ప్రాంతాల్లో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 14 జిల్లాల్లో 38.5 డిగ్రీలపైనే రికార్డు అయ్యింది. మరోవైపు ఎండలు పెరుగడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు హెచ్చరించారు. ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగానే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత ఎండలు పెరుగుతాయి. కానీ ఈసారి తొలి వారంలోనే వేడి తీవ్రత మొదలైంది. శనివారం ఆరు జిల్లాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. జయశంకర్`భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, భద్రాద్రి`కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *