- రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు
- నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉండాలని, జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బంది, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రేటర్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో ఎప్పటికప్పుడు వర్షాల పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.





