* బిల్లులు ఆమోదం పొందే వరకు నిద్రపోం
* రిజర్వేషన్లకు ఆమోదం తెలపకపోతే మోదీని గద్దె దించుతాం
* వందేళ్లుగా కుల గణన చేసిన ప్రభుత్వం ఏదీ లేదు
* బీసీ రిజర్వేషన్లు పెంచే అవకాశం నాకు దక్కింది
* బీజేపీ నేతలకు బీసీలు అవసరం లేదా?
* బీఆర్ఎస్ తెలంగాణ బంధాన్ని తెంచుకుందా?
* ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 06: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకుండా తాత్సారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ బిల్లులు ఆమోదం పొందే వరకు తాము నిద్రపోమన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం కోరుతూ ఢిల్లీ జంతర్‌మంతర్‌లో బుధవారం నిర్వహించిన పోరుబాట ధర్నాలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బలహీన వర్గాలపై కక్ష గట్టిన గత ముఖ్యమంత్రి కేసీఆర్ 50 శాతం రిజర్వేషన్లు మించకుండా చట్టం చేశారని, అది నేడు రిజర్వేషన్లకు గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో బలహీన వర్గాల బిడ్డలు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లు కాకుండా అడ్డుగా ఉన్న చట్టాన్ని తొలగించాలని తామ ఆర్డినెన్స్ చేసి గవర్నర్‌కు పంపామని, దానిని ఆమోదించడం లేదని సీఎం తెలిపారు. వెనుకబడిన వర్గాలకు స్థానిక ఎన్నికల్లో, విద్యా, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు ఢిల్లీలో ధర్నాకు దిగామని, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సాధించి తీరుతామని సీఎం అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనకు తెలంగాణలోనైనా ధర్నా చేయొచ్చని, కానీ అక్కడ ధర్నా చేస్తే స్థానిక పార్టీలు మాత్రమే వస్తాయని, అందుకే ది ల్లీలో ధర్నా చేస్తున్నామన్నారు. దిల్లీలో ధర్నా చేయడంతోనే కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎంపీలతో పాటు ఇండియా కూటమిలోని సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, వామపక్షాలకు చెందిన వంద మంది ఎంపీలు ధర్నాలో పాల్గొని మనకు సంఘీభావం తెలపడం విశేషమన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు మీకు అండగా ఉంటామని ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మనకు మద్దతు ఇచ్చారన్నారు. దేశంలో వందేళ్ల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేయలేదని, ఇప్పటి వరకు దేశంలో 300 మంది ముఖ్యమంత్రులైనా ఎవరూ చేయని పనిని చేసే అదృష్టం తనకు దక్కిందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపును ఆమోదించకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గద్దె దించుతామని ఆయన హెచ్చరించారు. ఈసారి బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ 150 సీట్లు దాటవని సీఎం జోస్యం చెప్పారు. బీసీ రిజర్వేషన్లను మోదీ అడ్డుకుంటే ఆయనను గద్దె దించి ఎర్ర కోట మూడు రంగుల జెండా ఎగురవేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకొని తమ డిమాండ్‌ను నెరవేర్చుకుంటామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాంచందర్‌రావులు బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డుపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు తెలంగాణ బీసీల అవసరం లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాకు ఎందుకు రాలేదని, ఆ పార్టీ తెలంగాణతో పేరు బంధంతో పాటు పేగు బంధం కూడా తెంచుకుందా అని సీఎం ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు ధర్నాను కేటీఆర్ డ్రామా అంటున్నారని, కేటీఆర్ పేరే డ్రామారావని, కేసీఆర్ కుటుంబం డ్రామాలతో బతుకుతోందని సీఎం విమర్శించారు. అధికారం, పదవులు పోయినా కేటీఆర్ బుద్ధి మారలేదని, అహంకారం తగ్గలేదన్నారు. ఆ కుటుంబంలోనే ఒకరు రిజర్వేషన్లకు అనుకూలమని, మరొకరు ప్రతికూలమని,మరొకరు అటూ ఇటూ కాకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెలంగాణ ప్రజల శక్తిని మోదీ తక్కువగా అంచనా వేస్తే ఆయనకు తడాఖా చూపిస్తామన్నారు. రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించకుంటే ఇక ఢిల్లీ రామని, గల్లీకి వచ్చినప్పుడు బీజేపీ నేతలను పట్టుకుంటామని హెచ్చరించారు. దళితులు, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వారసునిగా వచ్చిన రాహుల్ గాంధీ బీసీలకు న్యాయం చేసేందుకు కంకణం కట్టుకున్నారని, ఆయన మహత్తర ఆశయాలకు అడ్డుతగిలితే వారి చిరునామా గల్లంతవుతుందని సీఎం హెచ్చరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చిత్తశుద్ది ఉంటే రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులు తక్షణమే ఆమోదం పొందేలా చూడాలని.. లేకుంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బీజేపీకి, మోదీకి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ధర్నాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్‌లు, బీసీ సంఘాల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డికి పలువురి ప్రశంసలు
ధర్నాలో ప్రసంగించిన వక్తలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు పెంపునకు ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో పని చేస్తున్నారని కొనియాడారు వినోబా బావే భూదాన ఉద్యమం మొదలు పెట్టినప్పుడు తెలంగాణకు చెందిన ఓ రెడ్డి భూస్వామి భూదానం చేసి పెద్ద మనస్సు చాటుకున్నారు. రేవంత్ రెడ్డి రెడ్డి కులానికి చెందినప్పటికీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులు ఆమోదించారు. ఇది చరిత్రలో నిలిచిపోయే అంశమని మీనాక్షి నటరాజన్ అన్నారు. ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదు.. కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మాత్రమే చెప్పారు. ఒక కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు రేవంత్ రెడ్డి ఎదిగారు. పీడితులు, తాడితుల తరఫున రేవంత్ రెడ్డి పోరాడుతున్నారని ఎంపీ, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే అన్నారు. రేవంత్ రెడ్డి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.





