•అఖిలపక్షాన్ని కాంగ్రెస్ దిల్లీకి తీసుకెళ్లాలి
•తెలంగాణ విద్యావంతుల వేదిక
నల్గొండ, ప్రజాతంత్ర, జూలై 19: తెలంగాణ లో విద్యా ఉద్యోగ,స్థానిక సంస్థలలో బి.సీ ల 42% రిజర్వేషన్ అమలు జరగకుండా బిజెపి కుట్ర పన్నుతుందని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,బి.సి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ ఆరోపించారు. బిసి రిజర్వేషన్ అమలులో వివిధ పార్టీల అలసత్వాన్ని నిరసిస్తూ బీసీ విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ పట్టణంలోని పెద్ద గడియారం చౌరస్తాలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పందుల సైదులు మాట్లాడుతూ బీపీ మండల్ దగ్గర నుంచి మొదలు పెడితే నేటి వరకు బిజెపిది బీసీల పట్ల వ్యతిరేక వైఖరేనన్నారు.బీజేపీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే డిల్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలన్నారు. బీజేపీ నేతలు బీసీలను తప్పుదోవ పట్టించడం మానుకోవా లన్నారు. బీసీ రిజర్వేషన్లు ముస్లింలు ఉన్నందునే ఆమోదం తెలపలేదనడం వారి అవివేకానికి నిదర్శనం అన్నారు.జాతీయ స్థాయిలో ముస్లిం లకు బీజేపీ రిజర్వేషన్లు కల్పిస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తుంది వాస్తవం. ఏపీలో ఇండియా కూటమి ప్రభుత్వం ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నది నిజమన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్రమంత్రి బండి సంజయ్ లు బీసీ రిజర్వేషన్లపై అవగాహన లేకుండా మాట్లాడు తున్నారని,42శాతం బీసీ రిజర్వే షన్లలోనే 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని ఆరోపించడం దారుణం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను పెంచుతూ..తెలంగాణ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి..గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపి మూడు నెలలు పూర్తి అయినప్పటికీ నేటి వరకు ఆ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలప కుండా బీసీలకు అన్యాయం చేస్తున్నదన్నారు. బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేయడం లేదంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని బీసీలు భావిస్తున్నారన్నారు.
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండు నాలుకల వ్యవహారశైలిని అవలం బిస్తున్నాయని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్ ఆరోపిం చారు. బీఆర్‌ఎస్ నేతలు గత పది సంవత్స రాలుగా కేసీఆర్ ప్రభుత్వంలో భాగస్వా మ్యంగా ఉండి బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయంలో భాగస్వామ్యంగా ఉండి బీసీలకు అన్యాయం చేసిన వీరే, ఈరోజు బీసీ రిజర్వేషన్లు పెంచాలని మాట్లాడడం దెయ్యాలు, వేదాలు వల్లించిన చందంగా ఉన్నాయన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో కేసీఆర్ దీక్ష చేయాలన్నారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇప్పటివరకు జరిపిన ప్రక్రియను స్వాగతిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ బిల్లును ఢిల్లీకి పంపి మౌనంగా ఉండకుండా తక్షణమే పెద్ద ఎత్తున బీసీ రిజర్వేషన్లు అమలు కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడంతో పాటు ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ముఖ్య మంత్రిపై ఉందన్నారు.ఈకార్యక్రమంలో బిసి రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగు నరేష్ గౌడ్,విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పొగాకు రవి కుమార్ యాదవ్,శ్రీకాంత్ ,మహేష్, మణికుమార్,రాములు, శివ, యాదగిరి, ప్రభాకర్, నరసింహ ,మహేష్ ,పృద్వి ,సాత్విక్, ప్రదీప్,పునేందర్ తదితరులు పాల్గొన్నారు





