– బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేని బీజేపీ
– కామారెడ్డి ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో మంత్రి సీతక్క
కామారెడ్డి, ప్రజాతంత్ర, జులై 29: కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్‌కు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల పెంపునకు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామని, స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇచ్చేలా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా ఇందిరమ్మ మహిళా శక్తి సంబురాల్లో ఆమె ప్రసంగించారు. బిల్లు, ఆర్దినెన్స్ కేంద్రం వద్ద పెండిరగ్‌లో ఉన్నాయంటూ రిజర్వేషన్ల పెంపు బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. బిల్లుకు చట్టబద్దత లభించేలా తెలంగాణలోని బీజేపీ ఎంపీలు కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీసీలు కలిసి రావాలని, బీజేపీకి కావాలంటే అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వవచ్చునని అన్నారు. కొర్రీలు పెట్టి కాలయాపన చేయడం బీజేపీకి తగదదన్నారు. బీజేపీ ఎంపీలకు బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ది లేదని, అందుకే కుల గణనలో పాల్గ్గొనలేదని, బీసీ సోదరులే బీజేపీకి బుద్ది చెబుతారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు కోసం అన్ని పార్టీలను కలుపుకుని పార్లమెంటును స్తంభింప చేస్తామంటూ బీజేపీ దిల్లీ ప్రభుత్వం దిగి రాకపోతే ఆ పార్టీ పని గల్లీలో చూస్తామని అన్నారు. చట్టబద్దత కోసం రాష్ట్రపతిని కలుస్తామన్నారు. బీజేపీ నేతలు కోడి గుడ్డుపై ఈకలు పీకడం మానుకోవాలని హితవు పలికారు. బీసీ బిల్లుపై అభ్యంతరాలు ఉంటే చర్చిద్దాం కానీ కొట్లాటలు సృష్టించవద్దు అని హితవు పలికారు. గ్రామ పంచాయతీలకు రెండేళ్లుగా ఎన్నికలు లేక రూ.6వేల కోట్లు నష్టపోయామని, ప్రజల ఇబ్బందులు చూస్తే పంచాయతీరాజ్ మంత్రిగా బాధేస్తోందని అన్నారు.





