బీసీ రిజర్వేషన్‌తో నీకేం సంబంధం

-కవితకు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ ప్రశ్న

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 11: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఈ నిర్ణయం వెనుక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమ అధినేత రాహుల్‌గాంధీ ఆశయం ఉందని చెప్పారు. శుక్రవారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని మరోసారి నిరూపితమైందన్నారు. బీసీల అభ్యున్నతికి కాంగ్రెస్‌ పార్టీ ఎనలేని కృషి చేస్తోందని వివరించారు. అయితే బీసీ రిజర్వేషన్లకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. తాము చేసిన దానికి ఆమె క్రెడిట్‌ తీసుకోవడమేంటని, కవితను చూసి జనాలు నవ్వుకుంటున్నారని అన్నారు. ఆమె ఆదేశిస్తే మేం ఆర్డినెన్స్‌ తెచ్చామా అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ పదేళ్లు ఏం వెలగబెట్టారని ఆమె బీసీ పాట పాడుతున్నారని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్‌ అజెండా, రేవంత్‌ నిబద్ధత అని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు. కవితకు రాజకీయంగా ఎక్కడా చోటు లేకపోవడంతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీసీలకు కాంగ్రెస్‌ మేలు చేస్తే కవిత ఎందుకు రంగులు పులుముకుంటోందని ప్రశ్నించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీసీలను వంచించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు తగ్గించిన ఘనత కేసీఆర్‌దని అన్నారు. కేసీఆర్‌ కూతురైన కవిత పండుగ చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *