బీసీ ఉద్యోగుల సమాచారాన్ని 15లోగా అందించాలి

– వివిధ శాఖల కార్యదర్శులకు బీసీ కమిషన్‌ ఆదేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 25: తమ కమిషన్‌కు అప్పగించిన బాధ్యతలను పరిపూర్ణం చేయడానికి, సమర్థవంతంగా నిర్వర్తించడానికి వివిధ శాఖలలో బీసీ కులాల వారు ఎంతమంది ఉన్నారో సమాచారం తెలపాలన్న తమ లేఖపై తగిన సమాచారం రాలేదని బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులకు ఆరు నెలల క్రితం లేఖ ద్వారా విజ్ఞప్తి చేసినా ఫలితం లేనందున తిరిగి నేడు కార్యదర్శుల సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సచివాలయంలోని వివిధ విభాగాల కార్యదర్శులతో రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్‌ హరిత ప్లాజాలోని మంజీర హాల్‌లో సోమవారం సమావేశమై రాష్ట్రంలోని వివిధ శాఖలలో పనిచేస్తున్న బీసీ వర్గాల సిబ్బంది సమాచారాన్ని సెప్టెంబర్‌ 15వరకు కమిషన్‌కు సమర్పించాలని ఆదేశించింది. తొలుత కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీ బాల మాయదేవి సమావేశం ఉద్దేశం గురించి వివరించారు. చైర్మన్‌ నిరంజన్‌ మాట్లాడుతూ బీసీ కమిషన్‌ 2024 నవంబర్‌, డిసెంబర్‌లలో పది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించినప్పుడు తమకు ఎలాంటి అవకాశాలు లభించడం లేదని చిన్నచిన్న కులాల వారి నుండి ఫిర్యాదులు వచ్చాయన్నారు. బీసీల్లోని కొన్ని పెద్ద కులాల వారే లాభాలు పొందుతున్నారని, రిజర్వేషన్లు, బీసీల జాబితాను పునర్వర్గీకరణ చేయాలని కోరారన్నారు. రాష్ట్రంలో కొన్ని బీసీ కులాలకు సంబంధించిన అంశాలు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయని, వాటిపై తమ కమిషన్‌ విచారించి అభిప్రాయాన్ని నివేదించాలని ఆదేశించిందని చెప్పారు. నేటి సమావేశానికి గైర్హాజరైన వివిధ శాఖల కార్యదర్శులను కమిషన్‌ తప్పుపట్టింది. బాల మాయదేవి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. సమావేశంలో కమిషన్‌ సభ్యులు రాపోలు జయప్రకాష్‌, తిరుమలగిరి సురేందర్‌, రంగు బాలలక్ష్మి పాల్గొన్నారు. హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, రవాణా, రోడ్లు, భవనాల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌, దేవాదాయ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్‌, ప్రణాళిక, సామాజిక సంక్షేమ శాఖల కార్యదర్శి డాక్టరు జ్యోతి బుద్ధప్రకాష్‌, వ్యవసాయ, సహకార, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖల కార్యదర్శి ఎం.రఘునందన్‌ రావు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్‌ తదితరులు మాట్లాడుతూ సమాచార సేకరణలో అన్ని విధాల సహకరిస్తామన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *