– బీసీ కమిషన్ సమావేశంలో నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: ఖైరతాబాద్‌లోని రాష్ట్ర బీసీ కమిషన్ సమావేశంలో వివిధ అంశాలపై ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాల సేకరణపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. సమావేశానికి చైర్మన్ జి.నిరంజన్ అధ్యక్షత వహించారు. ఉద్యోగుల వివరాలు ఇంకా సమర్పించని ప్రభుత్వ కార్యదర్శులతో త్వరలో సమావేశమై సమీక్షించాలని కమిషన్ నిర్ణయించింది. అలాగే ప్రభుత్వంలోని అన్ని విభాగ అధిపతుల కార్యాలయాలలో బీసీ సెల్‌ల ఏర్పాటుకు సిఫారసు చేయాలని కమిషన్ నిర్ణయించింది. రాష్ట్ర బీసీ జాబితాలో ఉండి కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చని 40 కులాల విషయంలో కమిషన్ ఇదివరకే కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్‌కు లేఖ రాసింది. ఈ విషయం వారి పరిశీలనలో ఉందని, ఆర్టికల్`342ఏ ప్రకారం పార్లమెంట్ చట్టం ద్వారా కేంద్ర జాబితాలో చేర్చవలసి ఉంటుందని ఆయన సమాధానమిచ్చారు. ఈ విషయమై 40 కులాలకు న్యాయం జరిగేలా తనవంతు ప్రయత్నం చేయాలని కమిషన్ నిర్ణయించింది. అంతేకాక కమిషన్ కార్యాలయంలో గ్రంథాలయాన్ని నెల రోజులలో ప్రారంభించాలని నిర్ణయించింది. తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం విద్యుత్ సంస్థలలో రిజర్వేషన్‌ల అమలు, బీసీ ఉద్యోగుల ఇతర సమస్యలపై కమిషన్‌కు సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించి సుదీర్ఘంగా చర్చించింది. తొలుత ఈ ఫిర్యాదులపై ప్రాథమిక నివేదికను ఆ సంస్థ నుండి కోరాలని, అదనంతరం విద్యుత్ సంస్థల కార్యాలయాలను సందర్శించి విచారణ జరపాలని నిర్ణయించారు. సమావేశానికి కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి, కమిషన్ మెంబర్ సెక్రటరీ బాల మాయాదేవి, డిప్యూటి డ్కెరెక్టర్ యు.శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారి ఎన్.సునీత, సెక్షన్ ఆఫీసర్ జి.సతీష్ కుమార్, రీసెర్చ్ ఆఫీసర్ జి. లక్ష్మీనారాయణ హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





