– కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు చేయండి
– కేంద్ర మంత్రులను కోరిన మంత్రి తుమ్మల
న్యూదిల్లీ,సెప్టెంబర్16: బయ్యారం ఉక్కును వినియోగించి తెలంగాణకు న్యాయం చేయాలని కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామిని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరారు. దిల్లీలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఉక్కు శాఖమంత్రి కుమారస్వామితో తుమ్మల మంగళవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి ఈ సమావేశంలో మాట్లాడారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్య అని పేర్కొన్నారు. అక్కడ ఉన్న మినరల్‌ను ఏ విధంగా ఉపయోగించుకుంటారో కేందప్రభుత్వం పరిశీలించి తెలంగాణకు న్యాయం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అలాగే, కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కూడా మంత్రి తుమ్మల కలిశారు. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారని అన్నారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలకు భూ సేకరణ పూర్తయిందని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దక్షిణ అయోధ్య గా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. జాతికి వెలుగులు అందించే సింగరేణి గనులు.. హెవీ వాటర్ ప్లాంట్..ఐటీసీ ,బీ. పీ.ఎల్ సంస్థలతో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరుదైన ఖనిజ నిక్షేపాలతో అటవీ ప్రాంతంతో ఎకో టూరిజం కు కేరాఫ్ గా నిలిచింది.దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెం లో ఏర్పాటు చేశాం.గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం వల్ల పారిశ్రామికంగా విద్యా పరంగా టూరిజం పరంగా జిల్లా ఎంతో పురోగతి చెందే అవకాశం ఉందని, దేశ విదేశాల నుంచి భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం లో చొరవ తీసుకోవాలని రాంమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల సవివరంగా తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చేపట్టాల్సిన పనులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. తెలుగు బిడ్డడైన రాంమోహన్ నాయుడు చొరవతో కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కల సాకారం కానుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





