– మూడు పాటలను రాయించిన బిఆర్‌ఎస్
- పాటలు విడుదల చేసిన కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 18: ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బిఆర్‌ఎస్ రూపొందించిన బతుకమ్మ పాటల సిడిని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేశారు. అవన్నీ రాజకీయ పాటలే కావడం గమనార్హం. పండగపూట సర్కారును విమర్శిస్తూ ఉయ్యాల అన్న చరణంతో ఈ పాటలను వండి వార్చారు. మార్పు మార్పని వలలో మనలను ముంచిండ్రే వలలో.. అంటూ ఓ పాట.. మార్పు మార్పని మనం చేయి గుర్తుకు వొటేస్తె అంటూ మరో పాట.. ఆరు గ్యారెంటీలు ఉయ్యాలో ఆగమే జేసిండ్రు ఉయ్యాలో అంటూ మరో పాటను కేటీఆర్ ఆవిష్కరించారు. బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆత్మ.. ఈ గడ్డకు పరిమితమైన పూల సింగిడి. ఆడబిడ్డల పండుగ.. ఈ పండగపూట పురాణ గాథలు, కథలు, రామాయణ, మహాభారత ఘట్టాలను పాటలుగా పాడుతూ ఉంటారు. తరతరాలుగా వస్తున్న పాటల మాదిరిగా రాజకీయ విమర్శలను చేస్తూ పాటలు రాసి పాడించి మరీ వాటిని ఆవిష్కరించారు. ఈ పాటలు నిజంగా బతుకమ్మ దగ్గర పాడేలాన ఉన్నాయా..? పాడుతారా..? అనేది పక్కన పెడితే బతుకమ్మ లాంటి పండుగను కూడా రాజకీయ వేదికగా వాడుకునేందుకు యత్నిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. మొన్నటి వరకు బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసింది కవితమ్మ.. అంటూ చెప్పిన వాళ్లు బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని చెప్పడం గమనార్హం. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ బతుకమ్మను తెలంగాణ నుంచి వేరు చేసి రేవంత్ రెడ్డి మహిళల హృదయాలను గాయపరిచారన్నారు. ఈ నేల స్వభావం తెలిసిన పాలన మళ్ళీ రావాలన్నారు. పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ మూడు పాటలను స్పెషల్‌గా రాయించామని చెప్పుకొచ్చారు. కోటి మంది మహిళలను బతుకమ్మ చీరలతో గౌరవించిన నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మ మాయం చేశారంటూ విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆఫీసుల్లో బతుకమ్మ ఆడుకునే అవకాశం కేసీఆర్ ఇచ్చారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగ కోసం లంబాడీ ఆడబిడ్డలు ఎదురుచూస్తుంటారని మాజీ ఎంపీ మాలోత్ కవిత చెప్పారు. తెలంగాణ భవన్‌లో రాజకీయ పాటలను బీఆర్‌ఎస్ విడుదల చేయడం, కవిత చింత మడకలో బతుకమ్మ పండుగకు వెళ్తుండటం హాట్ టాపిక్‌గా మారాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




