26న బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలు

– 29న సరూర్‌ నగర్‌ స్టేడియంలో ‘గిన్నెస్‌’ రికార్డ్‌ బతుకమ్మ ఉత్సవం
– ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన సీఎస్‌
హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24: ఈనెల 29న సరూర్‌ నగర్‌ స్టేడియంలో నిర్వహించే భారీ బతుకమ్మ కార్యక్రమంతోపాటు, 26న ముఖ్యమంత్రి పాల్గొనే బతుకమ్మ కుంటలో బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ అంబర్‌పేట్‌లో ప్రభుత్వం పునరుద్ధరించిన బతుకమ్మ కుంటలో 26న నిర్వహించే బతుకమ్మ సంబరాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారని, ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మలతో హాజరవుతున్నందున తగు ఏర్పాట్లు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ, హైడ్రా అధికారులను ఆదేశించారు. బతుకమ్మకుంట ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఆహ్వానాలను ప్రజాప్రతినిధులు, వీఐపీలకు సకాలంలో పంపించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆయ‌న‌ ఆదేశించారు. సాయంత్రం 4 గంటల నుండే పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మ కుంటకు చేరుకునే అవకాశమున్నందున శానిటేషన్‌, బందోబస్తు, తాగునీటి సదుపాయం తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. అలాగే 29న సరూర్‌నగర్‌ స్టేడియంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ కార్యక్రమం గిన్నెస్‌ బుక్‌ రికార్డులో నమోదయ్యే అవకాశం ఉందని, ఇందులో పది వేలమందికి పైగా మహిళలు బతుకమ్మలతో హాజరవుతారని వెల్లడిరచారు. సరూర్‌ నగర్‌ స్టేడియంలోనూ మహిళలకు మౌలిక సదుపాయాల ఏర్పాటుతోపాటు స్టేజి ఏర్పాట్లు, విద్యుదీకరణ, శానిటేషన్‌లను చేపట్టాలని రామకృష్ణా రావు స్పష్టం చేశారు. వీటితో పాటు 27న సాయంత్రం ట్యాంక్‌ బండ్‌పై బతుకమ్మ కార్నివల్‌, 29న పీపుల్స్‌ ప్లాజా, 30న ట్యాంక్‌ బండ్‌పై పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశామని టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ వెల్లడిరచారు. ఈ కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయడానికి సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలన్నారు. కాన్ఫరెన్స్‌లో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ సి.వి.ఆనంద్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, హైడ్రా కమిషనర్‌ రంగనాధ్‌, జీహెచ్‌ ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌, ఫైర్‌ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, టూరిజం ఎండీ వల్లూరు క్రాంతి, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హరిచందన, నారాయణరెడ్డి, సమాచార పౌర సంబంధాల స్పెషల్‌ కమిషనర్‌ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *