మిన్నంటిన సద్దుల బతుకమ్మ సంబురాలు

ప్ర‌కృతి పండుగ‌కు ప‌ర‌వ‌శించిన జ‌నం

ట్యాంక్‌బండ్‌పై వైభవంగా ఉత్స‌వాలు

పలు జిల్లాల్లో వేడుకగా సాగిన ఆట‌పాట‌లు

గల్లీ నుంచి హైదరాబాద్‌ ‌బస్తీల వరకు వేడుకలు

మన ఆచారం, మ‌న‌ సంస్కృతీ బతుకమ్మ : మంత్రి సీతక్క

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ ‌పై గురువారం నిర్వహించిన బతుకమ్మ

వేడుకలకు పెద్ద ఎత్తున్న హాజరైన మంత్రులు, మహిళలు, అధికారులు. అమరుల స్థూపం వద్ద బతుకమ్మలతో

మంత్రి సీతక్క, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్‌లు తొలి పూజ నిర్వహించి ట్యాంక్‌బండ్‌పై

ఉన్న ప్రధాన వేదిక వరకు ర్యాలిగా తరలి వెళ్లారు.

 

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌10: ‌తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలంతా ఒక్కచోట చేరి ఆడిపాడుతూ సంబురాలు చేసుకున్నారు. మహిళలంతా తీరొక్క పువ్వులతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ సంబురాలతో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ ‌పరిసరాలు వెలుగులీనాయి. వేలాది మందితో బతుకమ్మ ర్యాలీ నిర్వహించారు. అలాగే ట్యాంక్‌ ‌బండ్‌ ‌పరిసరాలు మహిళల సందడితో కళకళ లాడింది. ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

సీఎం రేవంత్‌ ‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు సంబురాలకు హాజరయ్యారు. వందలాది మంది మహిళలు ’బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ ఆడిపాడారు. వేలాది మంది మహిళలతో హనుమకొండ పద్మాక్షి అమ్మవారి గుండం కిక్కిరిసిపోయింది. వికారాబాద్‌ ‌జిల్లా తాండూరులో మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడారు. కరీంనగర్‌, ‌నల్ల‌గొండ, ఆదిలాబాద్‌ ‌తదితర జిల్లాల్లో బతుకమ్మ సంబరాలు కోలాహలంగా సాగుతున్నాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఈ సంబురాలు గురువారం ముగిసాయి. తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం చివరి రోజైన సద్దుల బతుకమ్మ కావడంతో తెలంగాణ గల్లీగల్లీ నుంచి హైదరాబాద్‌ ‌బస్తీల వరకు వేడుకలు ఆకాశాన్నంటాయి. ఇటు ట్యాంక్‌బండ్‌ ‌పరిసరాల్లో మంత్రి సీతక్క సహ పలువురు మహిళ నేతలు, మహిళలు, యువతులు పెద్ద ఎత్తున తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనగా.. మరోపక్క ఊరూవాడా పూలవనంలా మారిపోయింది. మహిళలు, యువతులు, చిన్నారుల ఆటపాటలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. రాష్ట్ర ఆవిర్భావం నుంచే బతుకమ్మ సంబురాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. దీంతోపాటు బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి గౌరవించింది. బతుకమ్మల నిమజ్జనానికి ఊళ్లలో ఉండే చెరువులతో పాటు హైదరాబాద్‌ ‌వాసులు తమ సప నీటి వనరులను ఉపయోగించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాజ్‌భవన్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ, సతీమణి సుధాదేవ్‌ ‌పాల్గొన్నారు.

గవర్నర్‌గా నియమితులైన తర్వాత తొలిసారి సంబురాలు జరుపుకుంటుండడంతో పూల పండుగ విశిష్టతను అధికారులు గవర్నర్‌ ‌దంపతులకు అధికారులు వివరించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మనకు పూర్వీకులు ఇచ్చిన గొప్ప ఆచారం, సంస్కృతి బతుకమ్మ అన్నారు. ఈ రోజు చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని, చెరువులకు పూజలు చేసే పండుగ బతుకమ్మ అని, తెలంగాణ అంటేనే చెరువులు అని, బతుకమ్మ చెరువుల్లో నీరు తాగేదని, పొలాలకు నీరు అందించేదని ఆమె తెలిపారు. మన జీవన శైలి చెరువులపై ఆధారపడి ఉందని, హైదరాబాద్‌కు లేక్‌ ‌సిటీ అని పేరు ఉండేదని, కానీ, ఈ రోజు అవి కనుమరుగు అయిపోయాయని ఆమె తెలిపారు. ఆటలు, పాటలు, బతుకమ్మకు పూజలు ఇది తరతరాలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ట్యాంక్ బండుపై గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. బతుకమ్మ పండుగ చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీరితోపాటు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, ప్రజా గాయని విమలక్క, ఎమ్మెల్సీ కోదండరాం, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేలాదిమంది మహిళలు రాష్ట్ర సచివాలయం ఎదురుగా గల ఆమరవీరుల స్మారక కేంద్రo నుండి బతుకమ్మలతో, వివిధ కళా రూపాల ప్రదర్శనలతో ట్యాంక్బండ్ పైకి ఊరేగింపుగా వచ్చారు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద మంత్రి సీతక్క తో పాటు మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ తదితరులు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ట్యాంక్ బండ్ పై దాదాపు 40 నిమిషాలకు పైగా ప్రదర్శించిన క్రాకర్స్, లేజర్ షోలు సందర్శకులను పెద్ద ఎత్తున ఆకర్షించాయి. ఈ కార్యక్రమానికి సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ హనుమంతరావు పర్యటక శాఖ డైరెక్టర్ ఇలా త్రిపాఠి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ వివిధ శాఖల అధికారులు శాఖా పరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *