– గాంధీ భవన్‌లో మహిళా కాంగ్రెస్ సమావేశం
– ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: బతుకమ్మను ప్రకృతిని ఆరాధించే పండుగ అంటూ ఈ పండగ తెలంగాణకు ప్రత్యేకమైన ఆస్తిత్వం అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళా సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ భవన్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మహిళా కాంగ్రెస్ కార్యవర్గ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పండుగకు సంబంధించిన సంప్రదాయాలను, ఆరోగ్య ప్రయోజనాలను, చెరువుల పరిరక్షణలో బతుకమ్మ పాత్రను వివరించారు. పల్లె జీవితానికి, మహిళల సంఘ సంబంధానికి బతుకమ్మ ఎంతో కీలకం అని, బతుకమ్మ వేడుకలను సంప్రదాయ పద్ధతిలోనే జరుపుకోవాలని సూచించారు. ఈ నెల 29న సరూర్‌నగర్ స్టేడియంలో ప్రభుత్వం తలపెట్టిన గినెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు బతుకమ్మ కార్యక్రమంలో మహిళలు అంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పదివేల మంది మహిళలతో బతుకమ్మను గిన్నెస్ రికార్డుకు ఎక్కించే లక్ష్యంతో ప్రభుత్వ తరఫున వేడుక నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క వెల్లడిరచారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ప్రత్యేకంగా మహిళా సంక్షేమ కార్యక్రమాల్లో మహిళా కాంగ్రెస్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమేకాక మహిళలను బస్సు ఓనర్లుగా చేస్తున్నామంటూ ఇతర సంక్షేమ పథకాలను గుర్తుచేశారు. గత ప్రభుత్వం మహిళల అభయ హస్తం పొదుపు సొమ్మును రూ.3,500 కోట్ల వడ్డీని ఎగ్గొటిందని విమర్శించారు. అంతకుముందు పూర్వ ప్రధాని మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. అదే సందర్భంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద మంత్రి సీతక్క నివాళి అర్పించారు. జోహార్ చాకలి ఐలమ్మ అని నినాదాలు చేస్తూ ఆమె త్యాగాలను కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్, జిల్లాల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర నేతలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




