వైభవంగా ముగిసిన‌ బతుకమ్మ వేడుకలు

– జిల్లాల్లో ఉత్సాహంగా సాగిన పూలపండగ
– ఆడిపాడిన ఆడపడచులు.. యువత కేరింతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 1: తొమ్మది రోజులపాటు సందడిగా సాగిన బతుకమ్మ సంబరాలు బుధవారం సద్దుల బతుకమ్మతో ముగిసాయి. మళ్లీ రావమ్మా అంటూ ఆడపడచులు బతుకమ్మకు వీడ్కోలు పలికారు. చిన్నాపెద్దా తేడా లేకుండా ఆడబిడ్డలు రామ రామ రామ ఉయ్యాలో.. తొమ్మిది రోజులు ఉయ్యాలో.. అంటూ ఆడిపాడారు. ఆడపడుచుల ఆనందం ఆకాశాన్నంటగా తెలంగాణ బిడ్డలకు దీవెనలు ఇస్తూ బతుకమ్మ గంగమ్మ ఒడికి చేరింది. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై పదవ రోజున పెద్ద ఎత్తున నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పలువురు ప్రముఖ మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సరూర్‌నగర్‌లో నిర్వహించిన బతుకమ్మ గిన్నిస్‌ బుక్‌లో చోటు దక్కించుకుంది. బుధవారం సద్దుల బతుకమ్మతో ఊరూవాడా సందడిగా మారింది. సద్దుల బతుకమ్మ సందర్భంగా పల్లె, పట్నం, ఊరూ, వాడా, తంగేడు, గునుగు పువ్వుల వనాలయ్యాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌ విద్యుత్‌ దీపకాంతుల్లో వెలిగిపోయింది. సాంస్కృతిక కళారూపాలతో, పెద్దఎత్తున డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాలతో ట్యాంక్‌బండ్‌ వరకు ఊరేగింపు కళాత్మకంగా సాగింది. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులు పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకల్లో పాల్గొని చివరి రోజు ట్యాంక్‌బండ్‌ సహా జిల్లాల్లో భారీ బతుకమ్మతో వేడుకలు నిర్వహించుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆడపడుచులు పెద్ద ఎత్తున బతుకమ్మ కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పలు ప్రాంతాల్లో ఉత్తమ పాట, ఆటలకు బహుమతులు ప్రకటించడంతో ఆడిపాడేందుకు యువతులు పోటీపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *