~ కనివినీ ఎరుగని రీతిగా బతుకమ్మ సంబరాలు
– ఎల్‌ఈడీ తెరలు, విద్యుత్ దీపాలు
– సంస్కృతి, ప్రకృతి, పర్యాటకంతో మమేకయ్యేలా ఏర్పాట్లు
— బతుకమ్మ పండుగ, ముందస్తు ఏర్పాట్లపై మంత్రి జూపల్లి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: సకల జనుల సమ్మేళనంతో ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ పండుగ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా,ప్రకృతి, పర్యాటకంతో మమేకం అయ్యేలా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామాలతోపాటు హైదరాబాద్‌లోనూ అత్యంత వైభవంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక, చారిత్రక ప్రాంతాలను ముస్తాబు చేయాలని, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. బతుకమ్మపై ప్రత్యేక గీతాలు, మన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా, ప్రకృతి, పర్యాటకం, పర్యావరణం థీమ్ రూపకల్పన చేయాలని, వీటిని ప్రతీ ఒక్కరు కాలర్ ట్యూన్స్, సోషల్ మీడియా స్టేటస్‌లుగా పెట్టుకోవాలని కోరారు. ఉత్సవాల నిర్వహణ అనంతరం పూలు, ఇతర సామగ్రిని వృథాగా పారబోయకుండా వాటితో పర్యావరణహిత వస్తువులు తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వరంగల్‌లోని చరిత్రాత్మక వేయి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ ప్రారంభోత్సవం దిగ్విజయంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో కొన్ని ఎంపిక చేసిన జంక్షన్లతోపాటు టూరిజం హోటళ్లు, రైల్వే, బస్ స్టేషన్లు, విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాల్లోనూ బతుకమ్మ ప్రతిమలు నెలకొల్పాలన్నారు. విద్యార్థులంతా బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేలా కళాశాల, యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లా కలెక్టర్లు పండుగ దిగ్విజయంగా జరిగేలా కృషి చేయాలని సూచించారు. సాంస్కృతిక కళాసారధుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. సమీక్షలో పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యురాలు భవాని రెడ్డి, వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కాల్వ సుజాత, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డెరెక్టర్ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





