రేపటి నుంచి బతుకమ్మ సంబరాలు

– వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు జూపల్లి, కొండా సురేఖ, సీతక్క
– బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన జూపల్లి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 20: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మొదలుకానున్నాయి. ప్రారంభ వేడుకలకు చారిత్రక వేయి స్తంభాల గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి అనసూయ బతుకమ్మ అరంభ వేడుకలో పాల్గొననున్నారు. ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రజా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సకల జనులు, సబ్బండ వర్ణాలు కలిసి ఏకత్వస్ఫూర్తిని చాటేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించింది. చారిత్రక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతోందన్నారు. తెలంగాణ ఆడ్డబిడ్డలందరికీ ఈ సందర్భంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజల బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రార్థించారు.

బ‌తుక‌మ్మ పండుగ షెడ్యూల్ః

21వ తేదీ.. హన్మకొండ వేయి స్తంభాల గుడి – బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం (సాయంత్రం), హైదరాబాద్‌ శివారులో మొక్కలు నాటడం (ఉదయం)
22న శిల్పారామం, హైదరాబాద్‌, పిల్లలమర్రి, మహబూబ్‌నగర్‌
23న బుద్ధవనం, నాగార్జునసాగర్‌, నల్గొండ
24న కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, భూపాలపల్లి. సిటీ సెంటర్‌, కరీంనగర్‌
25న భద్రాచలం ఆలయం- కొత్తగూడెం, ఖమ్మం, జోగులాంబ అలంపూర్‌, గద్వాల
స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ, హైదరాబాద్‌, బతుకమ్మ ఆర్ట్‌ క్యాంప్‌ (25 నుంచి 29 వరకు)
26న అలీ సాగర్‌ రిజర్వాయర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, నెక్లెస్‌ రోడ్‌, హైదరాబాద్‌ -సైకిల్‌ ర్యాలీ (ఉదయం)
27న మహిళల బైక్‌ ర్యాలీ – నెక్లెస్‌ రోడ్‌, ట్యాంక్‌బండ్‌, హైదరాబాద్‌ (ఉదయం)
ఐటి కారిడార్‌, హైదరాబాద్‌-బతుకమ్మ కార్నివాల్‌ (సాయంత్రం)
28న ఎల్‌బి స్టేడియం, హైదరాబాద్‌ -గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ (పదివేలమందికిపైగా మహిళలతో 50 అడుగుల బతుకమ్మ)
29న పీపుల్స్‌ ప్లాజా, హైదరాబాద్‌-ఉత్తమ బతుకమ్మ పోటీలు, సరస్‌ ఫెయిర్‌ (ఎస్‌హెచ్‌జీలు), రెసిడెంట్‌ వెల్పేర్‌ అసోసిమేషన్స్‌, హైదరాబాద్‌ సాఫ్ఠ్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌-హైదరాబాద్‌, రంగారెడ్డి ప్రాంతం బతుకమ్మ కార్యక్రమం పోటీలు
30న ట్యాంక్‌బండ్‌-గ్రాండ్‌ ఫ్లోరల్‌ పరేడ్‌, వింటేజ్‌ కారు ర్యాలీ, బతుకమ్మ లైటింగ్‌ ఫ్లోట్స్‌, ఇకెబానా- జపనీయుల ప్రదర్శన, సెక్రటేరియట్‌పై 3డీ మ్యాప్‌ లేజర్‌ షో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *