సరూర్‌నగర్‌లో బతుకమ్మ సంబరం – ప్రపంచం గుర్తించిన తెలంగాణ ఉత్సవం

హైదరాబాద్‌ సరూర్‌నగర్ స్టేడియం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బతుకమ్మ సంబరాలకు సాక్ష్యమైంది. తెలంగాణ సాంస్కృతిక ఆత్మగా నిలిచిన ఈ పూల పండుగ ఈసారి ప్రపంచ వేదికపై కొత్త పుట రాసుకుంది. 66 అడుగుల ఎత్తు, 21 అడుగుల వెడల్పు, సుమారు 7 టన్నుల బరువుతో అద్భుతంగా నిర్మించిన బతుకమ్మ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి , ఎమ్మెల్యే మల్రెడ్డి వంటి ప్రముఖుల సాక్షిగా జరిగిన ఈ మహోత్సవం రాష్ట్ర గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.
 బంతి, గన్నేరు, గులాబీ, చామంతి వంటి పూలతో నిర్మించిన ఈ మహా బతుకమ్మ పూల పరిమళాలతో, రంగుల రాశులతో కనువిందు చేసింది. 1300లకు పైగా మహిళలు సమిష్టిగా పాల్గొని బతుకమ్మను స్త్రీ శక్తికి ప్రతీకగా నిలిపారు. అంకితభావం, సమన్వయం, శ్రమతో నిర్మించిన ఈ అద్భుత కృతికి గిన్నీస్ సంస్థ ప్రతినిధులు ప్రత్యక్ష సాక్షులుగా ఉండి ధృవీకరణ పత్రాన్ని అందజేయడం తెలంగాణ చరిత్రలో బంగారు అక్షరాలతో లిఖించదగిన ఘట్టంగా నిలిచింది.
స్టేడియం నిండా సాంప్రదాయ బతుకమ్మ పాటలతో గిన్నెల చప్పుళ్ల తాళంలో ఆడిన ఆటలు ఆ క్షణాలను మరపు రానివిగా మార్చాయి. ఆ రసరమ్య వాతావరణం ప్రేక్షకుల మనసులను పరవశింప జేసింది. పూలతో నిండిన ఆ విశిష్ట దృశ్యం తెలంగాణ సంప్రదాయ సౌందర్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటింది.
బతుకమ్మ పండుగ కేవలం పూల ఆట మాత్రమే కాదు, స్త్రీ శక్తి, ఐక్యత, భక్తి, ఆచార సంప్రదాయాల సమ్మేళనం. వనమూలికలు, పూలతో స్త్రీలు దేవిని ఆరాధించడం వెనుక లోతైన సాంస్కృతిక ఆధారం ఉంది. దసరా సమయాన ఆడే ఈ పూల పండుగలో ప్రకృతికి పూజ, భూదేవికి కృతజ్ఞత, స్త్రీశక్తికి గౌరవం వ్యక్తమవుతాయి. తెలంగాణ సమాజంలో బతుకమ్మ పండుగ పల్లెలు, ఊర్లు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రతి ఇంటిని కలుపుతుంది.
చరిత్రాత్మకంగా చూస్తే బతుకమ్మ పండుగ ఉద్భవం వనమూలికల వినియోగానికి, గ్రామీణ ఆరోగ్య సంప్రదాయాలకు సంబంధించి ఉన్నదని భావిస్తున్నారు. ఈ పూలలో ఎక్కువ శాతం ఔషధ గుణాలు కలిగినవే. స్త్రీలు పూలను సేకరించి, వాటిని అలంకరించి, ఒక సమిష్టి పండుగగా ఆడిపాడటమే కాకుండా కుటుంబ, సమాజ బంధాలను బలపరిచే విధానంగా కూడా ఇది రూపుదిద్దుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో బతుకమ్మ ఒక సాంస్కృతిక ఆయుధంగా ఉపయోగ పడింది. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ ఊరూరా, పల్లెలో ఉత్సాహాన్ని నింపింది.
ఈసారి ప్రపంచ రికార్డులో స్థానం సంపాదించడం ద్వారా బతుకమ్మ ఉత్సవం ప్రాంతీయ సరిహద్దులను దాటి అంతర్జాతీయ సాంస్కృతిక వారసత్వంలో చోటు సంపాదించింది. 1300ల పైగా మహిళలు ఒకే వేదికపై సమిష్టిగా ఆడిపాడిన ఈ ఘనత వారి ఐక్యతా భావాన్ని, సంప్రదాయ బలాన్ని ప్రతిబింబించింది. గిన్నీస్ వరల్డ్ రికార్డు పత్రం అందుకోవడం తెలంగాణ వారసత్వాన్ని విశ్వ వేదికపై నిలబెట్టింది.
66 అడుగుల ఎత్తైన ఈ అద్భుత బతుకమ్మ పూల పరిమళాలతో తెలంగాణ సాంస్కృతిక విశ్వ విహంగంలా ఆకాశాన్ని తాకింది. తరతరాలుగా పల్లెలో, ఊర్లో, పట్టణాల్లో జరుగుతున్న బతుకమ్మ సంప్రదాయానికి ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. తెలంగాణ గర్వకారణమైన ఈ పూల పండుగ గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించడం కేవలం రికార్డు మాత్రమే కాదు, సమాజం మొత్తం సాంస్కృతిక ఐక్యతకు, మహిళా శక్తికి, సంప్రదాయాల అద్భుతతకు ప్రతీకగా నిలిచింది.
రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *