– చిన్నారుల అక్షరాభ్యాసాలకు రద్దీ
నిర్మల్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 22: ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో దేవీ శరన్నవరాత్రులు సోమవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. తొలిరోజు అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిచ్చారు.చదువులతల్లి సరస్వతి దేవీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా అక్షరాభ్యాసాలు కూడా జోరుగా సాగాయి. ఈ సందర్భంగా బాసర ఆలయానికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. చిన్నారులకు పెద్దఎత్తున అక్షరాభ్యాసాలు చేయిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి చిన్నారులకు అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే అమ్మవారి వేదపారాయణం నిర్వహణ చేపట్టారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు రైల్వే స్టేషన్‌లో భక్తుల సందడి కనిపించింది. బాసర సరస్వతీ అమ్మవారిని మూల నక్షత్రంలో దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నక్షత్రం నవరాత్రుల్లో రావడం విశేషం. ఇందు కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు తమ చిన్నారులకు పెద్ద సంఖ్యలో అక్షరశ్రీకారాలు జరిపించనున్నారు. ఇకపోతే దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలతో మండపాలు, ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజలు చేస్తారు
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





