– బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ రంగాల యూనియన్ల జాయింట్ ఫోరం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 7: ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా 9న జరిగే అఖిల భారత సమ్మెలో తాము కూడా భాగస్వామ్యమవుతున్నట్లు బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ రంగాల యూనియన్ల జాయింట్ ఫోరం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఈనెల 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెలో రెండు తెలుగు రాష్ట్రాలలోని బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ రంగాలకు చెందిన దాదాపు లక్షమంది ఉద్యోగులు పాల్గొననున్నట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జాయింట్ ఫోరం ఆఫ్ ఫైనాన్సియల్ సెక్టార్ యూనియన్స్ (జెఎఫ్‌ఎఫ్‌ఎస్‌యు) ప్రకటించింది. కేంద్రంలో బిజేపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు ప్రభుత్వరంగ ఆర్ధిక సంస్థలైన బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ రంగాలను కూడా ప్రభావితం చేస్తూ వాటి మనుగడకే ప్రమాదకరంగా తయారయ్యాయని, ఈ విధానాలను ప్రతిఘటిస్తామని జెఎఫ్ హెచ్చరించింది. హైదరాబాద్ కోఠిలోని ఎపిటిబిఇఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్యాంకులు, ఇన్స్యూరెన్స్ సంస్థల ఉద్యోగులు, అధికారుల యూనియన్లతో కూడిన జెఎఫ్‌ఎఫ్‌ఎస్‌యు నాయకులు బి.ఎస్.రాంబాబు, సమద్ ఖాన్ (ఎపిటిబిఇఎఫ్‌ఎఐబిఇఎ), ఫణికుమార్ (ఎఐబిఓఎ), టివిఎన్‌ఎస్.రవీంద్రనాథ్ (ఎస్‌ఎన్‌జెడ్‌ఐఇఎఫ్), టి.సతీష్ (ఎన్.జి.తిరుపతయ్య (ఎల్‌ఐసిఇయు), కె.గంగాధర్ నాయుడు, ఎం.హరీష్ (బిఇఎఫ్‌ఐ), ఎస్.గుణశేఖర్, ఎల్.మద్దిలేటి (ఐసిఇయు), యూనియన్ల నాయకులు డి.గిరిధర్, ఆర్.శ్రీనివాస్, మహ్మద్ జావెద్ తదితరులు మాట్లాడారు. ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు మాట్లాడుతూ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థల ప్రైవేటీకరణకు కేంద్రం యత్నిస్తున్నదని, ఇప్పటికైనా ఈ విధానాలను విరమించుకోనట్లయితే పార్లమెంట్‌లో బిల్లు పెట్టిన రోజే దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సంస్థలలో నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికే బ్యాంకింగ్, ఇన్సురెన్స్ సంస్థలలో తగిన సిబ్బంది లేకపోవడం వల్ల పనిభారంతో ఉన్న సిబ్బంది అధికంగా పనిచేస్తూ సతమతమౌతుంటే, కొత్తగా పని గంటలను పెంచాలనే ప్రతిపాదనను తీసుకురావడం గర్హనీయమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ రక్షణ, ఉద్యోగులు, కార్మికులు, ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఇన్సురెన్స్ సంస్థలను కాపాడాకోవాల్సిన అవసరం ఉందని, అందు కోసం ఈ నెల 9న జరిగే సమ్మెకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. రవీంద్రనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగా ప్రభుత్వరంగ ఇన్సూరెన్స్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా దాడి చేస్తున్నదని, వంద శాతం ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వ ఇన్సూరెన్స్ సంస్థలను విదేశీ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ మధ్యతరగతి ప్రజలు తమ భవిష్యత్ కోసం చేసే ఇన్స్యూరెన్స్ పాలసీల ప్రిమియంపై జిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫణికుమార్ మాట్లాడుతూ నేషనల్ పెన్షన్ పథకాన్ని రద్దుచేసి అందరికీ నిర్దిష్ట పెన్షన్ (ఓపిఎస్) పథకాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల, కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు.
సతీష్ మాట్లాడుతూ గ్రామీణ బ్యాంకులను కూడా ప్రైవేటీకరించటానికి చట్టం చేసి ఐపిఓ ద్వారా మూలధనం సమకూర్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నదని, ఇప్పటికే అరకొరగా వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి, ఎంఎస్ సెక్టార్ అందుతున్న రుణ వసతి కూడా దెబ్బతీస్తుందన్నారు. ఈ ప్రతిపాదనను విరమించుకుని జాతీయ గ్రామీణ బ్యాంక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.




