కాలుష్య కాసారంగా బంజారా లేక్

– రక్షణకు చర్యలు తీసుకుంటామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
– ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి పరిశీలన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: బంజారాహిల్స్‌లో ఉన్న బంజారా లేక్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాజ్ బంజారా ముందున్న చెరువు తీవ్ర కాలుష్యంతో దుర్గంధభరితంగా మారిందంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కమిషనర్ రంగనాథ్ బుధవారం ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. చెరువులోకి మురుగు నీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతున్నాయని రంగనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు మంచినీటి సరస్సుగా ఉన్న బంజారా లేక్ ఇప్పుడు అత్యంత కలుషిత జలవనరుగా మారిందని, ఎఫ్‌టీఎల్ పరిధిలో రహదారి నిర్మాణం, చెరువు ఉనికికే ముప్పు తెచ్చిందని అన్నారు. కట్టమైసమ్మ ఆలయానికి వెళ్లే మార్గం ఆక్రమణపై భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, ప్రభుత్వ భూమిని కాపాడుతూ చెరువు పునరుద్ధరణకు సమగ్ర నివేదిక సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు. నివాసాలను ప్రభావితం చేయకుండా చెరువు రక్షణ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. నాలాలు మూసివేసే నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం శంషాబాద్‌లోని మామిడిపల్లిలో నాలుగైదు చెరువులు మాయమయ్యాయన్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఒంగోనికుంట, కనకయ్య కుంట, మర్రివాణి కుంట, ఎర్రకుంట ఆక్రమణలపై రంగనాథ్ సీరియస్ అయ్యారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల నుంచి పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. వరద కాల్వలు ఆక్రమణలతో మూసివేతకు గురై వర్షాకాలంలో నీట మునిగే ప్రమాదం ఉందని, ఆక్రమణదారులతో సమావేశమై స్వచ్ఛందంగా తొలగించకపోతే హైడ్రా చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులు, కాలువలపై పూర్తిస్థాయి డేటా సేకరణకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *