– వోట్ల చోరీ ఆరోపణల వెనక ఇదే లక్ష్యం
– రాహుల్ తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి అమిత్ షా
పాట్నా,సెప్టెంబర్18: వోట్ల చోరీ అంటూ ‘ఇండియా’ కూటమి తప్పుడు ఆరోపణలు చేస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శించారు. భాజపా అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని గతంలో ఇదే తరహా దుష్ప్రచారం చేసిందన్నారు. బిహార్‌లోని డెహరీ ఆన్ సోన్‌లో పార్టీ శ్రేణులతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ మేరకు మాట్లాడారు. బంగ్లాదేశీ చొరబాటుదారులను రక్షించడమే లక్ష్యంగా రాష్ట్రంలో ఇటీవల రాహుల్ గాంధీ యాత్ర నిర్వహించారని ఆరోపించారు. ఒకవేళ ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వొస్తే.. రాష్ట్రమంతా చొరబాటుదారులతో నిండిపోతుందని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులను రక్షించడమే రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ తిరుగుతూ.. ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వొస్తే బిహార్ చొరబాటు దారులతో నిండిపోతుందని చెప్పండి. అదేవిధంగా ‘వోట్ల చోరీ’ అంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి బీజేపీ యత్నిస్తుందని గతంలో ఇదే తరహా ఆరోపణలు చేశారు. కానీ.. అలాంటిదే జరగలేదు కదా‘ అని కాషాయ శ్రేణులను ఉద్దేశించి అమిత్ షా పేర్కొన్నారు. బిహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు అమిత్ షా ఈ పర్యటన చేపట్టారు. మగధ శాహాబాద్ ప్రాంతంలోని 10 జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. 2020 అసెంబ్లీ ఎన్నికలు, గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీయే పనితీరు అంతంతమాత్రంగానే ఉండటంతో ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అంతకుముందు సీఎం నీతీశ్ కుమార్ పాట్నాలో అమిత్ షాను కలిశారు. తాను ఎన్డీయేలోనే ఉంటానని ఇటీవల ప్రధాని మోదీ సమక్షంలో నీతీశ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





