– కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతిపై విచారణ కోరే దమ్ముందా?
– కాంగ్రెసోళ్లు తురకోళ్ల టోపీ పెట్టుకుని డ్రామాలాడుతున్నరు
– 70 శాతం హిందువుల సత్తా ఏందో చూపించండి
– మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణం
– రేవంత్‌కు దమ్ముంటే గోపీనాథ్ చావుపై విచారణ జరిపించాలి
– బోరబండ సభలో కేంద్ర మంత్రి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6: టోపీ పెట్టుకునే రోజు వస్తే తల నరుక్కుంటా.. నేను హిందువును.. టోపీ పెట్టి దొంగ నమాజ్ చేసి ఇతర మతాలను కించపర్చనని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోరబండ ఎన్నికల సభలో గురువారం ఆయన మాట్లాడుతూ మాగంటి గోపీనాథ్ చావుకు కేటీఆరే కారణమన్నారు. గోపీనాథ్ తల్లి చెప్పిన మాట ఇదన్నారు. రేవంత్‌కు దమ్ముంటే గోపీనాథ్ చావుపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌కు వావి వరసల్లేవు. చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడా లేనే లేదు. సీఎం పదవి కోసం ఏమైనా చేసే రకమని ఆరోపించారు. మీ తండ్రి వద్దకు పోయి అప్పుడప్పుడు బాగోగులు చూసుకోమంటూ కవితకు సలహా ఇచ్చారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగితే రూ.9 వేల కోట్లపైనే సీబీఐ విచారణ ఎందుకు కోరినట్లు అని సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. లక్ష ఓట్ల కోసం కాంగ్రెస్ ఒవైసీ సంక నాకుతున్నది. రావు వచ్చినా, రెడ్డి వచ్చినా మేం చెప్పినట్లు వినాల్సిందేనని ఒవైసీ చెప్పినా పౌరుషం లేని దద్దమ్మలు కాంగ్రెసోళ్లని ఎద్దేవా చేశారు. అజహరుద్దీన్ చేత వక్రతుండ అని గణేష్ మంత్రం చదవించే దమ్ముందా? ఒవైసీ సొదురులను భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు తీసుకుపోయి బొట్టు పెట్టించి అమ్మవారి పాట పాడిరచే దమ్ముందా? అని నిలదీశారు. జూబ్లిహిల్స్ హిందువులారా 70 శాతం ఓట్ల సత్తా ఏందో చూపించండని పిలుపునిచ్చారు. మేం మీటింగ్ పెట్టుకుంటే అనుమతి ఇచ్చి రద్దు చేస్తారా.. మీ పర్మిషన్ సంకలో పెట్టుకోండి.. పాత బస్తీలోనే సభ పెట్టి సత్తా చూపినం.. ఈ బోరబండ మాది.. బరాబర్ సభ పెడతం.. కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం అని చెప్పారు. బండి సంజయ్‌ను ఆపడం మీ తరం కాదు అన్నారు. కేటీఆర్ ఈమధ్య జనతా గ్యారేజ్ డైలాగ్ కొడుతున్నడు.. మూడేళ్ల తరువాత వాళ్ల అయ్య బయటకు వస్తడట.. సీఎం అయితడట. జనం చస్తుంటే రాడు.. రైతులు అల్లాడుతుంటే రాడు.. యాక్సిడెంట్స్ అయి జనం పోతుంటే రాడు.. ఇగ సీఎం ఎక్కడైతడు? అసలు కేటీఆర్‌కు తండ్రి సీఎం కావాలనే ఆశ లేనేలేదు.. తండ్రిని పక్కకు తోసి ఎప్పుడెప్పుడు సీఎం కావాలా అని చూస్తున్నడు.. ప్రజలు అల్లాడుతుంటే ఓదార్చింది మేం.. రైతుల బాధను పంచుకుంది మేం అని చెప్పారు. ఈ రెండేళ్లలో కేసీఆర్, ఆయన కొడుకు ఎన్నడైనా వచ్చాడా? అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికలో ప్రజలిచ్చే తీర్పు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు కనువిప్పు కావాలి అన్నారు. బోరబండలో కాంగ్రెస్ రెండేళ్లలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసిందా.. రోడ్డు విస్తరణ చేయాలని ఇండ్లు కూల్చిన కాంగ్రెసోళ్లు అక్కడ ఎంఐఎం షాపులు మాత్రం కూలగొట్టడం లేదు.. విస్తరణా జరపడం లేదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బుల్డోజర్లు పెట్టి వాటిని కూల్చివేయిస్తామన్నారు. ప్రజలంతా సమస్యలపై మాట్లాడాలని చెబుతుంటే బీఆర్‌ఎస్ వాళ్లు మాత్రం ఖబరస్తాన్ కడతామని మాట్లాడుతున్నరంటే ఏమనాలి అని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు దోచుకున్నరు.. ఫార్ములా ఈ రేసు పేరుతో దండుకున్నరు.. వాళ్లను ఓడిస్తే పరిస్థితి మారిందా? ఏనుగులు తినేటోడు పోయి పీనుగలు పీక్క తినేటోడు వచ్చిండు అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో అంతోఇంతో అబివృద్ధి జరుగుతోందంటే అది మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై లెక్కా పత్రంతో చర్చించేందుకు మేం సిద్ధం అని సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ ఓటర్లలారా 30 శాతం ఓట్ల కోసం 70 శాతం ఓట్లను పక్కనపెట్టిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు బుద్ది చెప్పండి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. చార్మినార్‌పై కాషాయ జెండా ఎగరేసేదాకా పోరాడతానని స్పష్టం చేశారు. భారత్‌ను ఇస్లాం దేశంగా మార్చాలని ఒవైసీ కుట్ర చేస్తుంటే. దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చి వికసిత్ భారత్‌గా మార్చాలని మోదీ కష్టపడుతున్నడు.. హిందూ రాజ్యం కావాలా? రామ రాజ్యం కావాలా? ఆలోచించండి అని విజ్ఞప్తి చేశారు. జూబ్లిహిల్స్‌లో నిన్న దాకా ఓకే (ఒవైసీ, కేసీఆర్) ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు ఒరే (ఒవైసీ, రేవంత్) ట్యాక్స్ నడుస్తోంది. ఇక్కడ బడ్డీ కొట్లు, తోపుడు బండ్లు నడపాలన్నా ఒరే ట్యాక్స్ కట్టాల్సిందేనట. అందుకే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను బొంద పెట్టండి. బీజేపీని గెలిపించండి అని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రలోభాలు పెడతాయి.. డబ్బులు తీసుకోండి.. ఆ పార్టీల చెంప చెళ్లుమన్పించండి అని బండి సంజయ్ కోరారు.





