– ఇచ్చిన హామీలు నిలుపుకోలేక నానా తంటాలు
– వోట్ చోరీ అంటూ ప్రజలను అవమానిస్తున్న కాంగ్రెస్
– మాది నిజంగానే దేవుళ్ల పార్టీ
– పిసిసి చీఫ్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి కౌంటర్
కరీంనగర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 26: కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వొస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాగ్దానాలు అమలు కాలేదని, మోసపూరిత హామీలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ పార్టీకి మళ్లీ అధికారం కలేనని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ఏమయ్యాయో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలని బండి సవాల్ చేశారు. కరీంనగర్‌లో మంగళవారం పర్యటించిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. వోట్ల చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఇటీవల చేసిన ఆరోపణల నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు. దొంగ వోట్లు అంటూ కాంగ్రెస్ నేతలు చేసే దుష్ప్రచారం ప్రజలను అవమానించడమేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వొచ్చాక పంచాయతీలకు ఒక్క పైసా అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇస్తుందనే ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు రాత్రిపూట యాత్రలు చేయడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. రెండుచోట్ల వోటు వేయడం ఎవరికైనా సాధ్యమా? అవగాహన లేకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు వోట్ల చోరీ గురించి కాకుండా సీట్ల చోరీ గురించి మాట్లాడాలి. రొహింగ్యాల విషయంలో వోటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. దేశం ముఖ్యమా? వోటు బ్యాంకు ముఖ్యమా? అప్పుడు భారత రాష్ట్ర సమితి.. ఇప్పుడు కాంగ్రెస్.. రెండూ అదే తరహా రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలను కలవకుండా రాత్రి పూట యాత్రలు ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. టీపీసీసీ చీఫ్ ఒక గజినీ.. ఆయనను ఎవరైనా గుర్తు పడతారా అని ప్రశ్నించారు. మహేష్ గౌడ్ వార్డు మెంబర్‌గా కూడా గెలిచావా అని బండి సంజయ్ నిలదీశారు. తెలంగాణలో వోటు చోరీ జరిగితే.. కాంగ్రెస్ ఎనిమిది ఎంపీ సీట్లు కూడా తామే గెలిచే వాళ్లమని చెప్పుకొచ్చారు. ప్రజల వోట్లతో మహేష్ గౌడ్ ఒక్కసారైనా గెలవాలని ఛాలెంజ్ చేశారు. కర్ణాటక, తెలంగాణలో రెలా గెలిచారని ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ బీఆర్‌ఎస్ మనిషి అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయనకు సెక్యూరిటీ కావాలని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వోటు చోరీ జరిగిందని ప్రజలను మహేష్ గౌడ్ అవమానిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలే వోట్ల బిచ్చగాళ్లు అని విమర్శించారు. టోపీలు పెట్టుకుని వోట్ల కోసం వెళ్లేది కాంగ్రెస్ నేతలే అని ఆక్షేపించారు. ఆరు గ్యారెంటీలపై ప్రజలు కొట్టేట్లు ఉన్నారన్నారు. కరీంనగర్ లో ఒక్కో మైనార్టీ ఇంట్లో 200 వోట్లున్నాయని పేర్కొన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ లో అధికారం ఎలా వొచ్చిందని బండి ప్రశ్నించారు. ఎన్నికలున్నా లేకున్నా హిందూ ధర్మం కోసం నిలబడతాం అని స్పష్టం చేశారు. భైంసాలో హిందువుల ఇళ్లు తగలబెట్టినప్పుడు వాళ్లెక్కడికి వెళ్లారని నిలదీశారు. తమది దేవుళ్ల పార్టీ అని, వారిది బిచ్చపు బతుకు అని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మం కోసం బిజెపి నిలబడుతుందని, యుపిఎ హయాంలోనే రోహింగ్యాలు దేశంలోకి వొచ్చారని తెలిపారు. కరీంనగర్ లో హిందూ వోటు ద్వారానే గెలిచానని బండి స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





