-11 ఏళ్లలో వారి కోసం రూ.71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మాదే
– ఎరువుల సబ్సిడీ రూపంలో రూ.11 లక్షల కోట్లకుపైగా ఖర్చు
– కనీస మద్దతు ధర కోసం రూ.16 లక్షల 35 వేల కోట్లు ఖర్చు
– టెన్త్ ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు స్కూటీ ఇచ్చేందుకు యత్నిస్తా
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
చొప్పదండి, ప్రజాతంత్ర, ఆగస్టు 2: ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన చరిత్ర లేదంటూ దీన్ని దృష్టిలో ఉంచుకుని గత 11 ఏళ్లలో రైతుల సంక్షేమం, వ్యవసాయం, అనుబంధ రంగాలకు దాదాపు రూ.71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత మోదీ సర్కార్‌కే దక్కిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. రైతును రారాజు చేయడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. అందులో భాగంగానే కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో గత 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా 9 కోట్ల 70 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లో రూ.3.89 లక్షల కోట్లకుపైగా సొమ్మును జమ చేశామన్నారు. తెలంగాణ విషయానికొస్తే 30.80 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.13 వేల కోట్లు జమ చేసినట్లు వివరించారు. ప్రధానమంత్రి కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమంలో భాగంగా బండి సంజయ్ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీ వారణాసి నుండి కిసాన్ ఉత్సవ్ దివస్‌లో చేసిన ప్రసంగాన్ని ఆయన ఆసక్తిగా తిలకించారు. అనంతరం చొప్పదండిలో జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో సంజయ్‌తోపాటు జిల్లా కలెక్టర్ పమేల సత్పతితోపాటు జిల్లా ఉన్నతాధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ఈరోజు కాశీ విశ్వనాథుడి ప్రసాదంగా కిసాన్ సమ్మాన్ నిధి సొమ్మును రైతులకు అందజేయడం గొప్ప కార్యక్రమం.. దేశవ్యాప్తంగా 9.70 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేయడం మామూలు విషయం కాదు. ప్రపంచంలోనే ఇంత పెద్ద గొప్ప స్కీం మరొకటి లేదు. ఎన్నికలతో, ఓట్లతో సంబంధం లేకుండా ఎన్ని ఇబ్బందులొచ్చినా ఠంచన్‌గా కోట్లాదిమంది రైతుల ఖాతాల్లో డబ్బును జమ చేస్తున్న ఘనత మోదీ సర్కార్‌దేనన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్దంతోపాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్దాలు, ఆర్ధిక సంక్షోభాల కారణంగా ఎరువుల ధరలు రెట్టింపు అయ్యాయి. అయినా రైతులపై ఒక్క పైసా అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం అతి తక్కువ ధరకే ఎరువులను సరఫరా చేస్తోందని వివరించారు. కాగా, టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీకి అద్బుతమైన స్పందన లభిస్తోందని, దిల్లీలో చాలామంది ఎంపీలు ఇదే విషయంపై అడుగుతున్నారని సంజయ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలను మరింతగా అబివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలున్న ఉపాధ్యాయులున్నారని, అందులో చదివితే నాణ్యమైన విద్య లభిస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాగా చదివి భవిష్యత్తులో టెన్త్ ఉత్తీర్ణులై ఇంటర్ చదివే వారికి స్కూటీ ఇచ్చేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలుండవ్
బీజేపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండబోవని, ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలనేది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. మాకు ఈ పదవి కావాలి.. ఆ పదవి కావాలి అంటూ సొంత నిర్ణయాలను ఎన్నడూ పార్టీ నాయకత్వంపై రుద్దబోమని, ఎందుకంటే బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పారు. నాయకత్వం ఏది చెబితే అది శిరసావహించి పనిచేస్తాం.. పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేయడమే కార్యకర్తలుగా, నాయకులుగా తమ బాధ్యత అని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కిసాన్ సమ్మాన్ నిధి, సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై వెళుతుండగా తనను మంత్రి పదవి నుండి విముక్తి కల్పించాలంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తలపై మీడియా అడిగిన ప్రశ్నకు పైవిధంగా బదులిచ్చారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాయొద్దని కోరుతున్నా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను చూసి బీజేపీ కూడా అట్లనే అని భావిస్తున్నారమో.. అలా కాదు. బీజేపీలో సమష్టి నిర్ణయాలుంటాయి. వాటిని అమలు చేసే బాధ్యత కార్యకర్తలుగా తమపౖౖె ఉంటుంది. కమిట్‌మెంట్ కలిగిన నాయకుడిగా భావిస్తాం అని చెప్పారు.



