పొన్నంతో కలిసి పనిచేస్తా

-నియోజకవర్గాన్ని అద్బుతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం
-ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు
– హుస్నాబాద్‌లో సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తాం
– సర్కార్‌ బడుల్లో సైకిల్‌ను బహుమతిగా ఇస్తా
– హుస్నాబాద్‌లో సైకిళ్ల పంపిణీలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌

హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో తాను రాజకీయాలు చేయబోనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. రాజకీయాలకతీతంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పనిచేస్తూ హుస్నాబాద్‌ సహా కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అందులో భాగంగా ఇద్దరం కలిసి హుస్నాబాద్‌ నియోజకవర్గంలో త్వరలోనే నవోదయ స్కూల్‌ను ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీంతోపాటు ఈ ప్రాంతంలో సైనిక్‌ స్కూల్‌ను ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తున్నామన్నారు. తొలుత కార్గిల్‌ దివస్‌ సందర్భంగా అమర సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు. మంత్రి పొన్నం ప్లాస్టిక్‌ను నిర్మూలించడంలో భాగంగా హుస్నాబాద్‌లో స్టీల్‌ బ్యాంక్‌ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి సమాజానికి తనవంతుగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని కోరారు. మోదీ స్పూర్తితో తాను మోదీ గిఫ్ట్‌ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందిదరికీ ఉచితంగా సైకిళ్లను అందిస్తుండటం సంతోషంగా ఉందన్నరు. అతి త్వరలోనే నర్సరీ నుండి 6వ తరగతి విద్యార్థులందరికీ బ్యాగు, స్టీల్‌ వాటర్‌బాటిల్‌, నోట్‌బుక్స్‌తో కలిపి మోదీ కిట్స్‌ ఇవ్వబోతున్నానన్నారు. ప్రతి ఏరియాలో వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే టెన్త్‌ విద్యార్థులకు బండి సంజయ్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ‘‘ప్రభుత్వ పాఠశాలల్లో చదవండి. సైకిల్‌ను బహుమతిగా పొందండి అని ఆఫర్‌ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో మోదీ గిఫ్ట్‌ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్‌ చదివే వందలాదిమంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ హైమవతి, అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, స్థానిక ఆర్డీవో, డీఈవో తదితరులు పాల్గొన్నారు. పలువురు విద్యార్థులు బండి సంజయ్‌కు ముందస్తుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలపడంతోపాటు రాఖీ కట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *