– ఎజెండాలోని ఇతర అంశాలపై నిపుణుల కమిటీని నియమించింది
– జల వివాదాలపై ఇరు రాష్ట్రాల సీఎంల మీటింగ్ కేంద్ర తొలి విజయం
– కేంద్రానికి ఇరు రాష్ట్రాలు సమానమే
– బీజేపీలో గ్రూపుల్లేవ్.. ఉన్నదల్లా మోదీ గ్రూపే
– కేంద్ర మంత్రి బండి సంజయ్‌బండి
హుజూరాబాద్, ప్రజాతంత్ర, జులై 17: బనకచర్ల విషయంలో ఇరు రాష్ట్రాలు చెరో మాట చెప్పడం ఏ మాత్రం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాల మధ్య ఏళ్ల తరబడి నెలకొన్న జల వివాదాలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించిందన్నారు. ఇరు రాష్ట్రాలు వేర్వేరు ఎజెండాలతో సమావేశానికి హాజరయ్యాయని, అయినప్పటికీ ఆయా ఎజెండాలలోని అంశాలపై నిపుణులు, ఉన్నతాధికారులతో కేంద్రం ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించిందని చెప్పారు. ఇది కేంద్రం సాధించిన తొలి విజయమని పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో గురువారం జరిగిన సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాల మధ్య వివాదంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నానన్నారు. నిన్నటి సమావేశం తరువాత రెండు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు బనకచర్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ఆశ్చర్యమేసిందన్నారు. లోపల ఏం జరిగిందో ఆ స్పష్టం చేయాలని వారిని కోరారు. కేంద్రం ఇంత మంచి నిర్ణయం తీసుకున్నా ఇద్దరు సీఎంలు కనీసం కృతజ్ఞత తెలపకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. జల వివాదాలపై బీఆర్‌ఎస్ చేస్తున్న ఆరోపణలు విడ్డూరంగా ఉన్నాయంటూ గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ఏపీలో నాటి ప్రభుత్వంతో కుమ్కక్కై కృష్ణా జలాలను తాకట్టు పెట్టిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం కూడా అదే పంథాలో ఉన్నట్లుంది.. అందుకే రెండు పార్టీలు కలిసి బనకచర్లపై లేనిపోని వివాదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నాయి అని విమర్శించారు.
రిజర్వేషన్లపై మా స్టాండ్ క్లియర్‌బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ స్టాండ్ చాలా క్లియర్‌గా ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకే అందజేస్తానంటే కేంద్రాన్ని ఒప్పించి బిల్లును ఆమోదించే బాధ్యతను మేం తీసుకుంటాం.. అలాకాక అందులో 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 51 శాతం బీసీ జనాభా ఉండగా 32 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇస్తాననడం ఎంతవరకు కరెక్ట్.. మోదీ ప్రభుత్వం ఇప్పటికే 27 శాతం రిజర్వేషన్లను బీసీలకు అమలు చేస్తుండగా కాంగ్రెస్ బీసీలకు ఒనగూర్చేదేమిటి అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇరిగేషన్ అధికారుల అవినీతిని చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.. అంచనాలు పెంచి ఏ విధంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిరదో వీళ్లను చూస్తే అర్ధమవుతోందని అన్నారు. ఇవిగాకాక డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ సహా కేసీఆర్ కుటుంబంపై ఎన్నో అవినీతి కేసులున్నా గత 19 నెలలుగా ఒక్కటంటే ఒక్క దానిలోనూ కేసీఆర్ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం దోషిగా తేల్చలేకపోయిందని విమర్శించారు. రెండు పార్టీలు కుమక్కయ్యాయంటూ తక్షణమే కాళేశ్వరం సహా బీఆర్‌ఎస్ అవినీతి స్కాంలపై సీబీఐ విచారణ కోరితే జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈనెల 24న విచారణకు రావాలని సిట్ పోలీసుల నుండి తనకు సమాచారం వచ్చిందని, విచారణకు హాజరవుతానని చెప్పారు.
బీజేపీలో ఉన్నదల్లా మోదీ గ్రూపే..
బీజేపీలో ఏ గ్రూపూ లేదు.. ఉన్నదల్లా మోదీ గ్రూప్.. బీజేపీ గ్రూప్. జెండా కోసం, పార్టీ కోసం పనిచేయాలి తప్ప వ్యక్తి కోసం పనిచేస్తే ప్రోత్సహించే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఏ గ్రామం నుంచి ఎవరు వచ్చినా పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్లను గుర్తించి ఎంపీ లాడ్స్, ఈజీఎస్ నిధులను అందిస్తున్నానని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాను 2.25 లక్షల మెజారిటీతో గెలిచానంటే కారణం కార్యకర్తల కష్టమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్లకు టిక్కెట్లిచ్చి గెలిపించుకునే బాధ్యత తీసుకుంటానని బండి హామీ ఇచ్చారు.





