బండి సంజయ్ రాజకీయ డ్రామా మాస్టర్

– మేయర్ ఎన్నికపై ఆయనవన్నీ కల్పిత కథలే
– బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు

కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17: కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ నైరాశ్యంతో కూడిన నాటకాలని బీఆరఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మండిపడ్డారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంజయ్ వైఖరిని ఎండగట్టారు. తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, సిరిసిల్ల వంటి మున్సిపాలిటీల్లో బీజేపీని గెలిపించుకోలేకపోయిన బండి సంజయ్, ఇప్పుడు ఒక్క మేయర్ స్థానం గెలవగానే అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్-బీఆరఎస్-ఎంఐఎం కుట్రలు అంటూ ఆయన చెబుతున్నవన్నీ సెల్ఫ్ స్క్రిప్టెడ్ కథలని కొట్టిపారేశారు. కరీంనగర్‌లో మరో రాజకీయ శక్తి ఎదగకూడదనే ఉద్దేశంతో బండి సంజయ్ స్వయంగా కుట్రలకు పాల్పడ్డారని రామకృష్ణారావు ఆరోపించారు. బీజేపీలోకి చేరతామన్న నలుగురు స్వతంత్ర కార్పొరేటర్లను కావాలనే వద్దన్నారన్నారు. కాంగ్రెస్‌కు పరోక్షంగా లాభం చేకూర్చేందుకు తన శిబిరం నుంచి ఇద్దరు కార్పొరేటర్లను విడుదల చేశారని చెప్పారు. బీఆరఎస్ అడ్డుకోవాలని అనుకుంటే అసలు బీజేపీ మేయర్ పీఠం దక్కేదే కాదని, కానీ బండి సంజయ్ తనను తాను హీరోగా, బాధితుడిగా చిత్రీకరించుకోవడానికి సానుభూతి డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీయే ప్రత్యామ్నాయం అనడం రాజకీయ అవివేకమని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39 శాతం, బీఆరఎస్‌కు 29 శాతం ఓట్లు వస్తే.. బీజేపీ కేవలం 15 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉందన్నారు. బీఆరఎస్ 18 మున్సిపాలిటీలు గెలిస్తే, బీజేపీ కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. ఈ వాస్తవాలు బండి సంజయ్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు?

సిర్పూర్ కాగజ్‌నగర్, నర్సాపూర్, మెట్‌పల్లి వంటిచోట్ల బీజేపీ మద్దతుతో కాంగ్రెస్ చైర్మన్లు అయినప్పుడు బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. అక్కడ తన కౌన్సిలర్లను సస్పెండ్ చేసే దమ్ము ఆయనకు ఉందా అని సవాల్ విసిరారు. దిల్లీలో కొట్టుకుంటూ, గల్లీలో దోస్తీ చేసే నీతిమాలిన రాజకీయం బీజేపీదేనని విమర్శించారు.

ఏడేండ్ల ఎంపీగా.. రెండేండ్ల మంత్రిగా తెచ్చిన నిధులేవి?

కేంద్ర మంత్రి హోదాలో ఉండి కార్పొరేటర్లను దిల్లీకి తీసుకెళ్తానని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. ఏడేళ్లు ఎంపీగా, రెండేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న బండి కరీంనగర్ కోసం తెచ్చిన ఒక్క భారీ ప్రాజెక్ట్ ఏది.. గిఫ్ట్ టు మోదీ అంటున్నారు.. మరి కరీంనగర్ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఏది అని రామకృష్ణారావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎప్పుడూ అభివృద్ధి రాజకీయాలనే చేస్తుందని, ప్రజలు మాటలను కాకుండా పనులను చూసి ఓటేస్తారని స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *