– బీసీ సంఘాలకు అన్ని పార్టీల మద్దతు
– బీజెపి లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు
– బీసీ బంద్‌కు అందరి మద్దతు ఉంది: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబరు17: బంద్ ఫర్ జస్టిస్ పేరుతో18వ తేదీన బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ సంఘాలు బంద్ పిలుపునకు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోంది. కాంగ్రెస్, బీజెపి, బీఆర్‌ఎస్, లెఫ్ట్ పార్టీలు కూడా బంద్‌కు మద్దతు ఇచ్చాయి. బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా ఆవేదనను తెలియచేయాలని ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే అన్ని పార్టీలను నేరుగా కలిసి కోరారు. బీసీ బంద్‌కు అందరి మద్దతు ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బిల్లును అడ్డుకునే వాళ్లు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నారని చెప్పుకొచ్చారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తాను కూడా బంద్‌లో పాల్గొంటానని ఉద్ఘాటించారు. ఈ బంద్‌లో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ అని ఉద్ఘాటించారు. తాము అధికారంలో ఉన్నప్పటికీ ఉన్నతంగా ఆలోచించి ఈ బంద్‌లో పాల్గొంటున్నామని వివరించారు. బీజేపీ నేతలు ఎన్ని మాటలు చెప్పినా బీసీల హృదయాల్లో చోటు సంపాదించుకోలేరని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఈ బంద్‌లో పాల్గొనాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీల బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందని ఆ పార్టీ భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేపటి బీసీ బంద్‌ని జయప్రదం చేయాలని సూచించారు. రేపటి బీసీ బంద్‌కి అన్ని పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి బీసీలకు న్యాయం చేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని ఉద్ఘాటించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశంలో జనగణనలో భాగంగా కులగణన జరగాలని కోరారని పేర్కొన్నారు.కాంగ్రెస్ డెడికేషన్ కమిషన్ పెట్టి శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసిందని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ వేశామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలని ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ కలిసి బీసీ బంద్‌కి మద్దతు కోరారని గుర్తుచేశారు. ఆర్. కృష్ణయ్యపై గురుత్వర బాధ్యత ఉందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్.కృష్ణయ్య తెలంగాణలో చేసే ప్రయత్నం దిల్లీలో కూడా చేయాలని కోరారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లని కృష్ణయ్య దిల్లీకి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని నరేంద్రమోదీతో చర్చించాలని సూచించారు. తాము కూడా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. వారితో కలిసి దిల్లీకి వచ్చి ప్రధాని మోదీని, రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. కాంగ్రెస్ బీసీ కులగణన చేసి 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. బీసీలకు న్యాయం చేసి బీజేపీ క్రెడిట్ తీసుకున్న తమకు నష్టం లేదని చెప్పుకొచ్చారు. కేబినెట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం తెలిపి గవర్నర్‌కి పంపించామని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ అంశంపై ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‌గౌడ్ చర్చిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో స్వాతంత్రం ఉంటుందని, అప్పుడప్పుడూ సమస్యలు వస్తాయని, అవి సద్దుమనుగుతాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో నియంత పాలన ఉండదని తెలిపారు. ఇవన్నీ చిన్నచిన్న సమస్యలేనని, టీ కప్పులో తుఫాన్ లాంటివేనని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





