– వ్యతిరేకించిన వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య
న్యూదిల్లీ, మార్చి 27: జన్ విశ్వాస్ (సవరణ) బిల్లును లోక్‌సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య వ్యతిరేకించారు. వ్యాపార సౌలభ్యం పేరుతో తీసుకొస్తున్న ఈ బిల్లులో పలు కీలక నిబంధనలను డీక్రిమినలైజ్ చేయడం వల్ల నియంత్రణ వ్యవస్థ బలహీనపడే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ అమలు విధానాలు బలంగా లేకుండా చట్టపరమైన శిక్షలను తగ్గించడం వల్ల ఉల్లంఘనలు పెరిగే అవకాశం ఉందని, ముఖ్యంగా ప్రజా ఆరోగ్యం, పర్యావరణం, కార్మిక హక్కుల వంటి కీలక రంగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వ్యాపారాలకు అనుకూలత కల్పించడమే కాకుండా ప్రజల హక్కులు, భద్రతను కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి కీలక సవరణలపై విస్తృత చర్చ జరిపి, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఎంపీ డాక్టర్ కావ్య డిమాండ్ చేశారు.
పారాక్వాట్ గడ్డి మందును నిషేధించండి
పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు)పై పూర్తి నిషేధం విధించాలని ఎంపీ డాక్టర్ కావ్య లోక్‌సభలో డిమాండ్ చేశారు. పార్లమెంట్ జీరో అవర్‌లో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ రసాయనం వల్ల పర్యావరణం, మానవ ఆరోగ్యంపై పడుతున్న దుష్పభ్రావాలను వివరించారు. పారాక్వాట్ డైక్లోరైడ్ కేవలం మొక్కలను నివారించే రసాయనం మాత్రమే కాదని, ఇది నేల, నీరు, గాలిని తీవ్రంగా కలుషితం చేస్తోందని ఎంపీ స్పష్టం చేశారు. వ్యవసాయ క్షేత్రాల్లో దీని మితిమిరిన వాడకం వల్ల భూసారం దెబ్బతినడమే కాక భూగర్భ జలాలు కూడా విషతుల్యం అవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆహారపు గొలుసులోకి చేరి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడ్డి మందు ఆత్మహత్యలకు ప్రధాన సాధనంగా మారడం అత్యంత కీలకమైన అంశం అని అన్నారు. పారాక్వాట్ సేవించిన సందర్భాల్లో మరణాల రేటు దాదాపు 100 శాతం ఉండటం అత్యంత భయానకమైన విషయం. దీనికి ఇప్పటివరకు ఎటువంటి విరుగుడు అందుబాటులో లేకపోవడం వల్ల హాస్పిటల్‌కి చేరినా ప్రాణాలు కాపాడటం అసాధ్యంగా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో పారాక్వాట్ వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని ఎంపీ వివరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్, పలువురు వైద్య నిపుణులు కూడా ఈ రసాయనం వల్ల కలిగే ముప్పును గుర్తించి, దీనిపై నిషేధం విధించాలని ఇప్పటికే గళమెత్తారు. ప్రజల ప్రాణాలను కాపాడటం కంటే వేరే ఏదీ ముఖ్యం కాదని, అందుకే కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీని తయారీ, అమ్మకాలు, వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన ఇటువంటి రసాయనాలకు బదులుగా పర్యావరణహితమైన, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని, ఈ దిశగా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆమె కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





