నగదు చెల్లింపులపై నిషేధం

– డిజిట‌ల్ సంత‌కాల‌తో రెండంచెల ఆమోద ప‌ద్ధ‌
– స్థానిక సంస్థ‌లు బ్యాంకు ఖాతాలు తెర‌వాలి
– ఖాతా తెర‌వ‌డానికి ముందు గ్రామ‌స‌భ ఆమోదం త‌ప్ప‌నిస‌రి
– పారద‌ర్శ‌క‌త కోసం న‌గ‌దు ర‌హిత విధానం
– ‘ఈ-గ్రామ్ స్వరాజ్‌, పీఎఫ్ ఎంఎస్ పోర్ట‌ల్ ద్వారా చెల్లింపులు
– పంచాయ‌తీలు, మండ‌లాల‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 25:  రాష్ట్రంలోని కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లలో 15వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ల (ఎస్ ఎఫ్‌సీ) నిర్వహణపై ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కమిషనర్ కార్యాలయం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్ర‌కారం  ద్విస్తరీయ ఆమోద విధానం (డీఎస్‌సీ) అమ‌లు చేస్తారు. ముఖ్యంగా నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డిజిటల్ సంతకాల (డీఎస్‌సీ) ద్వారా రెండంచెల ఆమోద విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్ర‌కారం ఉప సర్పంచ్ లేదా ఎంపీడీఓ (మేక‌ర్‌) పేమెంట్ వోచర్‌ను సిద్ధం చేయాలి. సర్పంచ్ లేదా మండల ప్రెసిడెంట్ (చెక‌ర్‌) తుది చెల్లింపును ఆమోదించాలి. ప్రతి గ్రామ పంచాయతీ, మండల పరిషత్ నిధుల కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాలను తెరవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ఒక ఖాతా, రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్ల (ఎస్ఎఫ్‌సీ) కోసం మరొక ఖాతా కేటాయించాలి. ఈ ఖాతాలలో ఇతర పథకాల (ఉదాహరణకు ఉపాధి హామీ) నిధులను కలపకూడదని ఆదేశించింది. ఖాతా తెరవడానికి ముందు గ్రామ సభ లేదా జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేయడం తప్పనిసరి. పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం నగదు రహిత విధానాన్ని అమలు చేస్తోంది. ఇకపై ఎలాంటి మ్యాన్యువల్ చెల్లింపులకు అవకాశం ఉండదు. అన్నీ ‘ఈ-గ్రామ్ స్వరాజ్’, పీఎఫ్ ఎంఎస్‌ పోర్టల్ ద్వారానే జరగాలి. ఇందుకోసం ప్రతి పంచాయతీ/మండలం తప్పనిసరిగా లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్‌జీడీ) కోడ్‌ను కలిగి ఉండాలి. కొత్త నిబంధనల ప్రకారం, ఈ ఖాతాలు జీరో బ్యాలెన్స్ ప్రాతిపదికన పనిచేస్తాయి. నిధులు రాష్ట్ర నోడల్ ఖాతాలో ఉంటాయి, కేవలం డిజిటల్ పేమెంట్ ప్రారంభించినప్పుడు మాత్రమే అవసరమైన మొత్తం సంబంధిత వెండర్ల ఖాతాల్లోకి వెళ్తుంది. సప్లయర్లు, కాంట్రాక్టర్లు అందరూ పీఎస్‌ఎంఎస్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిబంధనలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిషత్ సీఈఓలకు, జిల్లా పంచాయతీ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *