– రామాయంపేటలో విషాదఛాయలు
కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 6: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన బలగం సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన మురళీధర్ గౌడ్(బలగం నారాయణ) సతీమణి, వార్డు మాజీ సభ్యురాలు ఐరేని శశికళ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. గతంలో రామాయంపేట పంచాయతీగా ఉన్న సమయంలో ఆమె వార్డు సభ్యురాలిగా ఉన్నారు. శశికళ మృతితో ఆ కుటుంబంలోనేకాక రామాయంపేట పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అభిమానులు ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు. రామాయంపేటలో శుక్రవారం జరిగిన అంత్యక్రియలకు పట్టణ ప్రజలు, అభిమానులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామాయంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత గణేష్, మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పాక్స్ మాజీ చైర్మన్ బాధే చంద్రం, లక్ష్మాపూర్ సర్పంచ్, బీజేపీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి నవీన్ గౌడ్, కౌన్సిలర్ శంకర్ గౌడ్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు ఎస్కే అహ్మద్, టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి.జి.శ్రీనివాస శర్మ. రామయంపేట ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం, ప్రధాన కార్యదర్శి పటేరి రాము, జిల్లా కోశాధికారి దేవరాజు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు దేమే యాదగిరి. జయ రాజ్, బీజేపీ నాయకుడు పబ్బ సత్యంతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, స్నేహితులు, స్థానికులు తమ సానుభూతిని తెలియజేశారు.
సినీ రంగంలో మురళీధర్ గౌడ్ కుటుంబీకులు
బలగం సినిమాలో నారాయణ పాత్రలో నటించి ఫేమ్ అయిన మురళీధర్ గౌడ్‌కు భార్య శశికళ, ఇద్దరు కుమారులు రాము, పృథ్వీ ఉన్నారు. ఆ కుటుంబానికి చెందిన పలువురు సినిమాలలో, జబర్దస్త్ షోలో నటిస్తున్నారు. సినీ నటుడు, జబర్దస్త్ ఫేమ్ అభి బలగం నారాయణ కుటుంబానికి చెందిన వారే.





