– ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించిన బాధితులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 26: బహ్రైన్ లో రెండేళ్ళ జైలుశిక్షకు గురైన ఐదుగురు తెలంగాణ కార్మికుల కుటుంబ సభ్యులలో నలుగురి తల్లులు, ఒకరి చెల్లెలు సహాయం కోసం మంగళవారం హైదరాబాద్ లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి సూచన మేరకు వారు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట అందరు కల్సి ఒక ఉమ్మడి వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లు గల్ఫ్ కుటుంబాలను సీఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్యా దేవరాజన్ వద్దకు తీసికెళ్లి సమస్య తీవ్రతను వివరించారు. వారి గోడు విన్న వెంటనే ఆమె సీఎంఓ లో కీలక అధికారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ వి. శేషాద్రి దృష్టికి ఈ సమస్యను తీసికెళ్లారు. గల్ఫ్ కుటుంబాల వెంట బొజ్జ అమరేందర్ రెడ్డి, బషీర్ అహ్మద్, మోత్కూరి నవీన్ గౌడ్, కొండ శ్రీనివాస్ తదితరులున్నారు. గడువు తీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసి మార్చడం, నిల్వ, మార్కెటింగ్, అమ్మకం చేసిన ఆహార భద్రతా కేసులో ముగ్గురికి మూడేళ్లు, 19 మందికి రెండేళ్ల జైలుశిక్ష విధించిన సంఘటన ఇటీవల బహ్రైన్ లో జరిగింది. వీరిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన నకిడి లింబాద్రి (డిచుపల్లి), కర్రోల్ల లక్ష్మినర్సింహ (మల్లారం), తిమ్మజడ సంతోష్ (తిర్మన్ పల్లి), జగిత్యాల జిల్లాకు చెందిన గోవింద్ రాకేష్ (రత్నాపూర్), రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బంటు బాబు (కొండాపూర్) అనే ఐదుగురు యువకులు ఉన్నారు. యజమాని ఒత్తిడి వలన అమాయకులైన కార్మికులు విధులు నిర్వర్తించిన విషయాన్ని గమనించాలని, ప్రత్యేక కేసుగా పరిగణించి వారికి ‘క్షమాబిక్ష’ లభించేలా చూడాలని బాధితుల కుటుంబ సభ్యులు నకిడి గంగామణి (డిచుపల్లి), కర్రోల్ల సరస్వతి (మల్లారం), తిమ్మజడ నర్సవ్వ (తిర్మన్ పల్లి), గోవింద్ విజయ (రత్నాపూర్), బట్టు స్నేహ (కొండాపూర్) లు కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.




