– కేసీఆర్ అవినీతిని కక్కిస్తామన్నారు.. రూ.లక్ష కూడా కక్కించలేదు
– దిల్లీస్థాయిలో కాంగ్రెస్, కేసీఆర్‌ల మధ్య ఒప్పందం నిజం కాదా..
– బీఆర్‌ఎస్ నేతలపై కేసులన్నీ ఏమయ్యాయి?
– సీఎంవి సోయి లేని మాటలు
– రేవంత్‌రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 8: కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతో ముఖ్యమంత్రి సోయి తప్పి మాట్లాడుతున్నాడు అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు తాను ఏమి చేశాడో వివరించి, ఆ తర్వాత ప్రత్యర్థిని విమర్శిస్తూ ఓట్లు అడగాలి అని సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మీద కానీ, ప్రభుత్వం అమలు చేసిన హామీలు ఏమాత్రం ఉన్నాయో ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా ప్రత్యర్థిపై విమర్శలు మాత్రమే చేస్తున్నాడన్నారు. ప్రజల్లో వ్యతిరేకతను మళ్లించే వ్యూహంలో భాగంగానే తమపై, ప్రధానమంత్రిపై, తమ పార్టీపై తప్పుడు విమర్శలు చేస్తున్నాడని ఆక్షేపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసిపోయాయని రేవంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగజారిపోయి ప్రచారం చేస్తున్నారన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రచారమే చేశారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ తనపై వ్యక్తిగత విమర్శలు చేశాడు. అయినా ప్రజలు దానిని విశ్వసించలేదన్నారు. మోదీ నాయకత్వంలో ఒక్క చిన్న అవినీతి ఆరోపణ కూడా లేకుండా పనిచేస్తున్న పార్టీ మాది అని చెప్పారు.
దిల్లీస్థాయిలో రెండిరటి మధ్య ఒప్పందం వాస్తవం కాదా?
లక్ష కోట్ల అవినీతి డబ్బులు కక్కిస్తానన్న రాహుల్ గాంధీ లక్ష రూపాయలను కూడా బయటకు తీశాడా అని ప్రశ్నించారు. దిల్లీి స్థాయిలో బీఆర్‌ఎస్-కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరింది వాస్తవం కాదా? కేటీఆర్ నిన్న కాక మొన్న మాట్లాడుతూ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని తప్పించాలనుకున్నాడు అని ప్రచారం చేసింది నిజం కాదా? దిల్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కేటీఆర్ సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, కేజ్రీవాల్‌ను కలుపుకొని పోరాటం చేయాలన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఏ విషయంలో బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటయ్యాయో చూపించాల్సిందిగా సవాల్ చేస్తున్నానన్నారు. ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్ల, ధాన్యం కొనుగోళ్ల, భూముల కొనుగోళ్ల కేసులు ఏమయ్యాయి అంటూ ఒక్క బీఆర్‌ఎస్ నేతపై చర్యలు తీసుకున్నావా రేవంత్ రెడ్డీ అని నిగ్గదీశారు. మీ పార్టీలో నీ మీద నమ్మకం ఉందా.. మీ మంత్రులు నిన్ను నమ్ముతున్నారా? వారు ఏ మాట్లాడుకుంటున్నారో వింటున్నావా? వాళ్లు కార్యకర్తలతో ఏం చెబుతున్నారో నీకు తెలుసా అని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు, 420 సబ్-గ్యారంటీలతో మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. కాంట్రాక్టుల దగ్గర, రియల్ ఎస్టేట్, పరిశ్రమల దగ్గర వేలాది రూపాయలు వసూలు చేసింది నిజం కాదా? బీహార్ ఎన్నికలకు ఆ డబ్బు పంపింది నిజం కాదా? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయడానికి మనసు రాదు.. ఆరోగ్యశ్రీ బకాయిలున్నాయి.. కేంద్రం ట్రిపుల్ ఆర్‌కు ఆమోదం తెలిపినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని తెలిపారు. గత మీట్ ది ప్రెస్‌లో హైదరాబాద్‌కు కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టులు, నిధుల గురించి వివరించాం.. దీనిపై చర్చించడానికి రేవంత్ రెడ్డి, కేసీఆర్‌కు సమయం ఉంటే రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో వివరించడానికి తాను సిద్ధంగా ఉన్నాననన్నారు.
బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆరే
కేటీఆర్, కిషన్ రెడ్డిలు ‘బ్యాడ్ బ్రదర్స్’ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఎవరు ఎవరికి బ్రదర్స్? ఎవరు ఎవరిని కాపాడుతున్నారు? కేసీఆర్‌ను కాపాడుతోంది కాంగ్రెస్ కాదా అని అడిగారు. ‘బ్యాడ్ బ్రదర్స్’ ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి, కేసీఆరే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ ప్రభుత్వం అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఫేక్, ఫ్రాడ్, ఫాల్స్, ఫెయిల్యూర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వమన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడిన, నిరుద్యోగులను, మహిళలను మోసం చేసిన బ్యాడ్ బ్రదర్స్ వాళ్లే.. మజ్లిస్‌ని పోషించి వారి కనుసైగల్లో, వారి ఆలోచనలను పాటించే బ్యాడ్ బ్రదర్స్ వాళ్లే అని ఆయన దుయ్యబట్టారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్, దళితులకు రూ.12 లక్షలు ఇస్తానని మోసం చేసిన బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్. మహిళలకు తులం బంగారం, స్కూటర్, పొదుపు సంఘాలకు వడ్డీ అని ఇవ్వకుండా మోసం చేసిన బ్యాడ్ బ్రదర్స్ రేవంత్, కేసీఆర్ అని అన్నారు. వీరితోపాటు మూడో బ్యాడ్ బ్రదర్ అసదుద్దీన్ ఓవైసీ. కేసీఆర్, అసదుద్దీన్, సోనియా కుటుంబం తెలంగాణ పాలిట ‘బ్యాడ్ బ్రదర్స్’గా తయారయ్యాయి అని చెప్పారు. రేవంత్ రెడ్డి మజ్లిస్‌లో తప్ప అన్ని పార్టీలలో పనిచేశాడు. ఆ అనుభవంతోనే ఇలా మాట్లాడుతున్నాడన్నారు. రేవంత్ ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల్లో ఎనిమిది సీట్లలో కాంగ్రెస్‌ను ఓడిరచామని చెప్పారు. బీజేపీ ఆట మొదలు పెడితే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల కింద ఉన్న భూమి కదులుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. మూసీ ప్రక్షాళనలో అధికార, మజ్లీస్ పార్టీ నేతల భవనాల జోలికి వెళ్లరు కానీ పేదల ఇళ్లను మాత్రం కూలగొడతారన్నారు. చైనా సరిహద్దులో చైనా సైనికులను భారత సైనికులు కొట్టారని, సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయా అంటూ పాక్ సైనికులను పొగుడుతూ భారత సైనికులను అవమానించాడు.. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషేనా అంటూ బీజేపీ ఏ మతాన్నీ అవమానించదన్నారు. ఓట్ల కోసం ఎంతకైనా దిగజారే పార్టీ కాంగ్రెస్ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





