– విచారణ చేపడతామన్న ఆర్‌ఎంవో
కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి2: యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వికటించి చిన్నారి మృతిచెందిన సంఘటన కామారెడ్డిలో చోటుచేసుకున్నది. చిన్నారి మృతి ఘటనపై విచారణ చేపడతామని ఆర్‌ఎంవో సంతోష్ తెలిపారు. ఉదయం 11.30 గంటలకు దవాఖాన నుంచి బయటికి వెళ్లారని, ప్రైవేట్ దవాఖానకు సుమారు 2.30 గంటలకు వెళ్లారని, ఈ మధ్యలో ఏమి జరిగిందో విచారణ చేసిన తర్వాత చెప్పగలమని పేర్కొన్నారు. రెండు డోస్‌లు వేసినప్పుడు పాప బాగానే ఉన్నదని, మూడో డోస్ వేసినప్పుడు కూడా బాగానే ఉన్నదని తెలిపారు. విచారణ తరువాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కామారెడ్డి మండలం కొటాల్‌పల్లికి చెందిన అర్చన-రమేశ్ దంపతులు కామారెడ్డిలోని అయ్యప్ప నగర్‌కాలనీలో నివాసముంటున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. జనవరి 25న ఇంటి ఎదుట ఆడుకుంటుండగా రెండున్నరేండ్ల క్రితిక్ సారాను కుక్క కరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించగా ఇంజక్షన్ ఇచ్చారు. ఆదివారం మూడో డోస్ ఇప్పించడానికి చిన్నారిని జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. డోస్ తీసుకోగానే చిన్నారి అపస్మారక స్థితికి చేరగా వెంటనే ప్రైవేట్ దవాఖానకు తరలించగా అప్పటికే చిన్నారి మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతిచెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆందోళనకు దిగారు. దవాఖానలోని ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చేరుకొని బాధిత కుటుంబీకులకు నచ్చజెప్పినా వినిపించుకోకుండా సుమారు రెండున్నర గంటలపాటు ఆందోళన చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.