హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 14: సినీ వినీలాకాశంలో సీనియర్ నటి బి.సరోజా దేవి(87) బెంగళూరులోని తన నివాసంలో సోమవారం ఉదయం కన్నుమూశారు. తెలుగు, కన్నడ, తమిళ భాషా సినిమాల్లో ఆమె అక్కినేని, ఎన్టీరామారావు, ఎంజీఆర్ల వంటి వారితో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1938లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 1955లో మహా కవి కాళిదాస అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేశారు. తెలుగులో పెళ్లి సందడి (1959)లో అవకాశం వచ్చింది. సీతారామ కల్యాణం, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణార్జున యుద్ధం, దాగుడుమూతలు, ఆత్మబలం, శకుంతల, దానవీర శూరకర్ణ, అల్లుడు దిద్దిన కాపురం, వంటి పలు తెలుగు చిత్రాల్లో నటించారు. 200కుపైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆమెను 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. కాగా, సరోజాదేవి మృతిపట్ల బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆమె మరణం దక్షిణ భారత సినీ రంగానికి తీరని లోటని, తెలుగు సినీ ఇండస్ట్రీతోపాటు దక్షిణాది చిత్రసీమలో అద్భుతమైన అభినయంతో, అసాధారణ నటనతో లక్షలాదిమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ నటి అంటూ ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు సినీ రంగంలో అభినయ సరస్వతిగా ఖ్యాతి పొందారన్నారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబానికి, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు. సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని రామచందర్రావు తెలిపారు.
సీనియర్ నటి బి.సరోజాదేవి కన్నుమూత





