– ప్రాచీన వైద్య విధానాన్ని కాపాడుకోవాలి
– వైద్య రంగంలో ఉన్నత స్థానంలో కొనసాగుతున్న భారత్
– బహుళజాతి అల్లోపతి కంపెనీల కుట్రలను తిప్పికొట్టాలి
– నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: ఆయుర్వేదం మన ప్రాచీన వైద్యవిజ్ఞానం మాత్రమే కాదు.. భారతీయ జీవన విధానంలో వెల్‌నెస్, ఫిజికల్ మెంటల్ బ్యాలెన్స్‌కు సంబంధించిన పూర్తి తత్వ శాస్త్రంగా మనం చూడాలి అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇటీవల కాలంలో ఆయుర్వేదం కనుమరుగయిందని, మోదీ ప్రధాని అయ్యాక 2014 నుంచి ఆయుర్వేదానికి ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన నేషనల్ ఆయుర్వేద కాన్ఫరెన్స్‌లో ఆయన ప్రసంగించారు. వేల ఏళ్ల క్రితం ప్రపంచం కనీసం ఊహించలేని వైద్య విజ్ఞానం మన భారతదేశం సొంతమని, వేల ఏళ్ల క్రితమే ఆపరేషన్లు, కృత్రిమ అవయవాలు, టాక్సికాలజీ, డయాగ్నస్టిక్ టెస్టులు, కాటరాక్ట్ ఆపరేషన్లు చేసిన ఘనమైన చరిత్ర మనది అని వెల్లడిరచారు. చరకుడు, సుశ్రుతుడు, వాగ్‌భట్టు వంటి ఎందరో మహానుభావులు ఈ ప్రాచీన భారత విజ్ఞానం ద్వారా నాటి సమాజానికి వైద్యం చేశారన్నారు. చరక సంహిత, సుశ్రుత సంహిత వంటి గ్రంథాలు వైద్యం, ఆపరేషన్లు మొదలైన వాటిలో యావత్ ప్రపపంచానికి మార్గదర్శనం చేశాయన్నారు. ఫాదర్ ఆఫ్ సర్జరీ అయిన సుశ్రుతుడు నాటి కాలంలోనే ఆపరేషన్లను చేస్తే చరకుడు ఫిజియాలజీ గురించి, వివిధ థెరపీల గురించి సమస్త మానవాళికి జ్ఞానాన్ని అందించారని, ఇలాంటి మహనీయుల పరిశోధనల ఫలితంగానే నాటినుంచి నేటివరకు వైద్య రంగంలో, చికిత్సా రంగంలో భారతదేశం ఉన్నతమైన స్థానంలో కొనసాగుతోందని అన్నారు. ఆయుర్వేదాన్ని ఓ పాత కాలపు వైద్యంగా, పనికిరానిదిగా గత ప్రభుత్వాలు చూశాయని, అయితే గత 11 ఏళ్లలో మనమంతా గర్వపడేలా ఆయుర్వేదాన్ని మళ్లీ వినియోగంలోకి తీసుకొచ్చి ‘వెల్‌నెస్’ విషయంలో మోదీ ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచానికి హబ్‌గా మారుస్తోందని అన్నారు. ఇవాళ్టి ఈ కాన్ఫరెన్స్ థీమ్ అయిన ఏన్షియంట్ ఇన్‌సైట్స్-మోడ్రన్ అడ్వాన్స్‌మెంట్స్ మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయుర్వేద పునర్వైభవం కోసం జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ దిశగా 2014లో మోదీ ప్రభుత్వం మొదట ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని, ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆరు నెలల్లోనే మోదీ ఆయుర్వేదానికి, యోగాకు గుర్తింపు తీసుకొచ్చేందుకు తానే అంబాసిడర్ బాధ్యతలు తీసుకున్నారని వెల్లడిరచారు. ప్రపంచ దేశాలను ఒప్పించి జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించేలా చొరవ తీసుకున్నారన్నారు. యావత్ ప్రపంచాన్ని కరోనా మహమ్మారి భయపెడుతున్న సమయంలోనూ యోగా ద్వారా మనకు ఎంత భరోసా కలిగిందనేది మీ అందరికీ తెలుసునన్నారు. కరోనా సమయంలో భారతీయ సంప్రదాయ వైద్య విధానాలకు రెమెడీస్‌గా, హీలర్స్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించిందన్నారు. కరోనా సమయంలో భారత దేశంలో 50 కోట్ల మంది చనిపోతారని ఎన్నో మాటలు మాట్లాడారు.. అవమానించారు.. ఆరోజు అమిత్ షా ఆధ్వర్యంలో తానే ఆ టాస్క్ఫోర్స్‌కు బాధ్యత వహించానని, ఆరోజు 140 కోట్ల మంది ప్రాణాల్ని కాపాడిన వైద్య విధానమే ఆయుర్వేదం అని, పసుపు వినియోగం పెరగడం, తిప్పతీగ (గిలోయ్) ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవడం వంటివాటిని ప్రపంచవ్యాప్తంగా అనుసరించారన్నారు. అది ఆయుర్వేదాన్ని, యోగాను ప్రమోట్ చేయడంలో మోదీ సర్కార్ కమిట్‌మెంట్‌కు ఒక ఉదాహరణ మాత్రమేనన్నారు. ఆత్మనిర్భర్ భారత్, ‘వికసిత్ భారత్-2047 లక్ష్యాల్లోనూ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఓ ప్రధానమైన భూమిక పోషించనుందని, ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించడం మాత్రమే కాదు.. ఈ విషయంలో సృజనాత్మకతను, పరిశోధనలను ప్రోత్సహిస్తూ భారతదేశాన్ని గ్లోబల్ వెల్‌నెస్ కేంద్రంగా మార్చడంలో విశేషమైన ప్రయత్నం జరగనుందని కిషన్‌రెడ్డి చెప్పారు. కానీ, నేడు బహుళ జాతి కంపెనీలు అలోపతి మందుల కంపెనీలు ఆయుర్వేదాన్ని పద్ధతుల్ని యోగాని అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దీన్ని తిప్పికొట్టాలని, ఈ సమయంలో మన సంప్రదాయ వైజ్ఞానిక విద్య యోగాను రాజకీయాలకు సంబంధం లేకుండా కాపాడుకోవడం మన బాధ్యత అని, అందుకు మోదీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఉపాధి కోసం పనిచేయాలనే ఆలోచనల్ని పక్కనపెట్టి ఇది మన దేశ సంపద.. ఇది మన జీవన విధానం.. భారతీయ వైద్యం అని మన భావితరాలకు దీన్ని అందించాలనే సంకల్పంతో వైద్యులు పనిచేయాలని సూచించారు. జూన్ 2016లో అమెరికా కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ యోగా భారత దేశపు ప్రాచీన విజ్ఞానమే అయినా దీనిపై మేం మేధో సంపత్తి హక్కు(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ తీసుకోలేదేని గుర్తుచేశారన్నారు. మానవాళి శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరమైన యోగాను యావత్ ప్రపంచానికి అందించాలన్న లక్ష్యంతోనే తాము ఐపీఆర్ తీసుకోలేదన్నారు.
ఆయుష్ మినిస్ట్రీ ద్వారా అన్నింటికీ ప్రోత్సాహం
ఆయుష్ మినిస్ట్రీ ద్వారా ఆయుర్వేదం, యోగాతోపాటు నేచురోపతి, యునాని, సిద్ధ వైద్యం, సోవా-రిగ్పా, హోమియోపతి వంటి వాటికి ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. నేషనల్ ఆయుష్ మిషన్(ఎన్‌ఏఎం) ద్వారా విశేషమైన పని దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. తెలంగాణలోనూ ఈ మిషన్ కింద సిద్దిపేట, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం జరిగిందని, ఈ కేంద్రాల ద్వారా యోగా, నేచురోపతి ట్రీట్‌మెంట్ అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ రామంతపూర్‌లోనూ ఇలాంటి ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దీనికి భూసేకరణను పూర్తిచేసి అవసరమైన డీపీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నానని అన్నారు. ఆయుష్ మినిస్ట్రీ బలోపేతానికి, ప్రజారోగ్య వ్యవస్థ పటిష్టానికి హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్‌తో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఆయుష్ వెల్‌నెస్ సెంటర్ల ఏర్పాటుకు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ రూ.16.05 కోట్లు కేటాయించిందన్నారు. భారతీయ లోకల్ మెడిసినల్ ప్రోడక్ట్స్ తయారీతోపాటు ఈ రంగంలో స్టార్టప్స్ కారణంగా అంతర్జాతీయ వెల్‌నెస్ మార్కెట్లో ఇండియన్ బ్రాండ్స్‌కు డిమాండ్ పెరిగిందని, అందుకే ఇవాళ మోదీ నేతృత్వంలో ఆయుర్వేదం భారత దేశపు సాఫ్ట్ పవర్‌గా ప్రపంచవ్యాప్తంగా గుడ్‌విల్‌ను పెంచుతూ కల్చరల్ డిప్లమసీకి బాటలు వేస్తోందన్నారు. ఇవాళ వందకు పైగా దేశాల్లో ఆయుర్వేదాన్ని ప్రివెంటివ్ కేర్‌గా వాడుతుండడం మనందరికీ గర్వకారణమన్నారు. అంతేకాక దేశవ్యాప్తంగా ఉన్న వెల్‌నెస్ సెంటర్లలో చికిత్స పొందేదుకు వివిధ దేశాల పర్యాటకులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఆయుష్ వీసాల ద్వారా మెడికల్ టూరిజాన్ని పెంచడంపైనా దృష్టి సారించామన్నారు. వేలమంది భారతీయులు నివసించే పరాగ్వే దేశంలో భారతీయ ఎంబసీలలో స్థానికురాలైన ఎరికా హ్యూబర్ ఆయుర్వేద కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న విషయాన్ని మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించారని కిషన్‌రెడ్డి తెలిపారు.
మెడికల్ హబ్‌గా హైదరాబాద్‌కు ప్రత్యేకత
ప్రపంచస్థాయి వైద్య సేవలు, ఫార్మా కంపెనీల కారణంగా హైదరాబాద్ ప్రపంచ మెడికల్ హబ్‌గా ప్రత్యేకతను సంతరించుకుంటోందని, దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు ఆయుర్వేద ఆధారిత స్టార్టప్ కంపెనీలు, న్యూట్రాసూటికల్ ఇండస్ట్రీస్ (బేసిక్ న్యూట్రిషన్‌కు అదనంగా పోషకాలు అందించే ఫుడ్ తయారు చేసే కంపెనీలు), ఆయుర్వేదంలో పరిశోధనా సంస్థలకు మరింత అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆధునిక అలోపతిక్ వైద్య వ్యవస్థతో ప్రాచీన ఆయుర్వేదాన్ని జోడిరచి వైద్యం చేసే అవకాశాలు రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాంయన్నారు. దేశవ్యాప్తంగా ఆయుష్ గ్రామ్‌ల ఏర్పాటుతో క్షేత్రస్థాయిలో ఆయుర్వేద ప్రాక్టీషనర్లకు మద్దతు లభిస్తోంది. అంతేకాక ఐఐటీ, ఐఐఎస్(ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్), జేఎన్‌యూ వంటి యూనివర్సిటీల్లో ఆయుష్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటయ్యాయని, ఇలాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా మన ప్రాచీన వైద్య విధానాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం కృషిచేస్తోందని వివరించారు. ఇవాళ్టి కార్యక్రమంలో పాల్గొంటున్న ఆయుర్వేద విభాగం మేధావులు, ప్రాక్టీషనర్లకు విన్నపం.. ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి మన ప్రాచీన జ్ఞానాన్ని జోడిరచేందుకు ఇదే సరైన సమయమని, ఇందుకోసం వివిధ ఇంటర్నేషనల్ జర్నల్స్, సైంటిఫిక్ మ్యాగజైన్స్‌లో మీ ఆలోచనలను, మీ పరిశోధనలను పంచుకోండి అని పిలుపునిచ్చారు.. భారతదేశంతోపాటు ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల వరకు ఆయుర్వేదాన్ని విస్తరించడంలో కీలక బాధ్యత తీసుకోండి.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాలన్న ప్రయత్నంలో ఆరోగ్య భారత నిర్మాణం కూడా మన సంకల్పంలో భాగం కావాలి.. ఇందుకోసం ఆయుష్ విభాగం కీలకమైన పిల్లర్ కావాలి అని ఆకాంక్షించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి విశ్వ ఆయుర్వేద పరిషత్, తెలంగాణ చాప్టర్ వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను.మూడు దశాబ్దాలుగా ఆయుర్వేదంపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించడంతోపాటు ఈ ప్రాచీన భారత వైద్య విజ్ఞానాన్ని తర్వాతి తరాలకు అందించేందుకు చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమన్నారు.




