– ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా..
ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని, క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ బుధవారం నగరంలో 300 బైకులతో భారీ బైక్ ర్యాలీని నిర్వహించింది. క్యాన్సర్‌ను జయించడం సాధ్యమే.. భయం వీడండి.. అవగాహనే మీ రక్షణ కవచం అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది. క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, క్రమమైన స్క్రీనింగ్ ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం. ఈ ర్యాలీ రెనోవా హాస్పిటల్స్‌కు చెందిన అన్ని కేంద్రాల నుంచి ప్రారంభమైంది. రెనోవా సెంచరీ హాస్పిటల్స్ – బంజారా హిల్స్, రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్– కార్ఖానా, డిడిహెచ్ రెనోవా క్యాన్సర్ సెంటర్– విద్యానగర్, రెనోవా బిబి క్యాన్సర్ హాస్పిటల్ –మలక్‌పేట్ నుంచి బయలుదేరిన ప్లకార్డులు, నినాదాలతో సందడిగా సాగుతూ హుస్సేన్ సాగర్ వెస్ట్ పార్క్, నెక్లెస్ రోడ్ వద్ద కలిసాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ త్రినాథ్ నరుకుల్లా, గౌరవ అతిథులుగా కె.శశిశ్రీ, అడిషనల్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్), డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, డా. సాజిదా ఖాన్, డా. సాజిదా ఖాన్, ఆడియో ఇంజనీర్, సామాజిక నాయకురాలు & విద్యావేత్త, భారతదేశపు తొలి మహిళా ఆడియో ఇంజనీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రినాథ్ మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలనే లక్ష్యంతో రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం అభినందనీయమని అన్నారు. ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధిగా భావించబడిన క్యాన్సర్, ప్రస్తుతం సమయానికి ముందస్తు గుర్తింపు, క్రమమైన స్క్రీనింగ్, సరైన చికిత్స అందిస్తే నియంత్రించవచ్చు అని, అనేక సందర్భాల్లో పూర్తిగా నయం చేయగల వ్యాధిగా మారిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య పరిరక్షణ దిశగా నిరంతరం కృషి చేస్తున్న రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
శశిశ్రీ మాట్లాడుతూ మహిళల ఆరోగ్య పరిరక్షణలో అవగాహన కార్యక్రమాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ వంటి వ్యాధుల విషయంలో ముందస్తు గుర్తింపు, క్రమమైన స్క్రీనింగ్ పరీక్షలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు అనేక ప్రాణాలను రక్షించగలవని తెలిపారు. మహిళలు భయం, అపోహలను దూరం చేసుకొని, బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ వంటి స్వీయ పరీక్షలను క్రమం తప్పకుండా చేయడం, ఏవైనా అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరమని ఆమె సూచించారు. ఇటువంటి కార్యక్రమాలు మహిళలను ఆరోగ్యంపై చైతన్యవంతులుగా తీర్చిదిద్దడంలో కీలకంగా నిలుస్తాయని పేర్కొంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రెనోవా హాస్పిటల్స్ సేవలను అభినందించారు. డాక్టర్ శ్రీనివాస్ జూలూరి మాట్లాడుతూ క్యాన్సర్ పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి, వారిని చైతన్యపరచడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. అయితే నేటి వైద్య విజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల క్యాన్సర్ చికిత్సలో గణనీయమైన పురోగతి సాధ్యమైంది. ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధిగా భావించిన క్యాన్సర్, ఇప్పుడు సమయానికి గుర్తిస్తే మరియు సరైన చికిత్స అందితే నియంత్రించగల, అనేక సందర్భాల్లో పూర్తిగా నయం చేయగల వ్యాధిగా మారిందన్నారు. రెనోవా గ్రూప్ ఎల్లప్పుడూ సామాన్యులకు సైతం అత్యాధునిక క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తోందని, ఆరోగ్యకరమైన జీవనశైలే క్యాన్సర్‌కు ఉత్తమ వ్యాక్సిన్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో డా.ఇండీవర్ కిరణ్, మెడికల్ డైరెక్టర్, డా. హేమంత్ కుమార్, డా. పి. సత్య దత్తాత్రేయ, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డా. రాజేష్ బొల్లం, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, చీఫ్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ , హైపెక్ సర్జన్, డా. ఎల్ యుగంధర్ శర్మ, సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, డా.సయ్యద్ అక్రమ్ కె, సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, డా.మహమ్మద్ అబ్దుల్ అజీమ్, రేడియేషన్ అంకాలజిస్ట్, శ్రీ. జనార్ధన్, రెనోవా గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, రవీంద్రనాథ్ గరగ, సీఈఓ, రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, డా.మహదేవ్, డా.వారిస్, రామసుబ్బారెడ్డి, శ్రీవల్లిలతోపాటు పలువురు వైద్యులు, వైద్యేతర సిబ్బంది, అధికారులు, పెద్ద సంఖ్యలో పాల్గొని క్యాన్సర్‌పై అవగాహన సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




