– దురహంకారం తగ్గించుకో
– కేటీఆర్‌పై మంత్రి సీతక్క ఫైర్
ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రతిష్టను దెబ్బతీసేలా కావాలనే కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు, కొందరు స్వాములు తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వారం రోజులపాటు తాము 24 గంటలూ అక్కడే ఉండి పనిచేశామని, కోట్లాదిమంది భక్తులు సుఖశాంతులతో దర్శనం చేసుకున్నారని తెలిపారు. జాతరను సక్సెస్ చేయడంలో సహకరించిన ములుగు జిల్లా మీడియా సోదరులకు, అధికారులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జాతర నిర్వహణ, ఏర్పాట్లపై బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తీవ్రంగా తప్పుబట్టారు. జాతర ఘన విజయాన్ని జీర్ణించుకోలేకనే కేటీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు ప్రణాళికలు రూపొందించి పారిశుధ్యం, తాగునీరు, రవాణా, భద్రత వంటి అన్ని మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా ఏర్పాటు చేసిందని ఆమె స్పష్టం చేశారు. ప్రజల సౌకర్యాలే లక్ష్యంగా రాత్రింబవళ్లు శ్రమించిన అధికారులూ, ఉద్యోగుల కృషిని కేటీఆర్ తక్కువ చేయడం బాధాకరమని విమర్శించారు. అసత్య వ్యాఖ్యలతో ప్రజలను గందరగోళానికి గురిచేయాలని చూస్తే తగిన విధంగా ఎదుర్కొంటామని హెచ్చరించిన మంత్రి ‘కేటీఆర్.. నీ దురహంకారాన్ని తగ్గించుకో.. ప్రజల విశ్వాసాన్ని పొందిన ఈ జాతరను రాజకీయంగా దుష్ప్రచారం చేయడం సరికాదు’ అని హితవు పలికారు. గుడిలో చేసిన ప్రతి మార్పు పూజారుల ఆమోదం, ఎండోమెంట్ కమిషనర్ అనుమతితోనే జరిగిందని స్పష్టం చేశారు. అయినప్పటికీ సమ్మక్క గద్దెల వద్ద కూడా రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. శుక్రవారం సాయంత్రం వీఐపీ వాహనాలు భారీగా రావడంతో కొంతసేపు ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడిందని, అది బస్సులు లేకపోవడం వల్ల కాదని తెలిపారు. గత జాతరలతో పోలిస్తే ఈసారి ట్రాఫిక్ సమస్యలు చాలావరకు తగ్గాయని చెప్పారు. వ్యక్తిగత భూముల్లో జరిగిన చిన్న వ్యాపారాలను కూడా దందాలుగా చిత్రీకరించడం కుట్రపూరితమని మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో ఎవరైనా అక్రమాలు చేస్తే తామే బాధ్యత వహిస్తామని స్పష్టం చేశారు. జాతరలో ప్రమాదాలు జరుగుతాయని, ప్రాణనష్టం జరుగుతుందని యూట్యూబ్‌లు, టీవీ ఛానళ్లలో చేసిన ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. ఈసారి మాస్‌తోపాటు క్లాస్, సూపర్ క్లాస్ భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడం కొందరికి జీర్ణించుకోలేక నెగటివ్ నరేటివ్‌ను సృష్టిస్తున్నారని విమర్శించారు. దేవతలను, జాతరను కించపరచడం సహించబోమన్నారు. జాతరలో 13 వేల మంది పోలీసులు, 40 రోజులపాటు జిల్లా యంత్రాంగం సేవలందించినట్లు తెలిపారు. భక్తుల విశ్వాసాన్ని కాపాడటమే తమ బాధ్యతని స్పష్టం చేశారు.
ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి
నూతనంగా ఏర్పడ్డ ములుగు మున్సిపాలిటీకి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరచిన 20 వార్డుల సభ్యులు ప్రతి ఒక్కరినీ గెలిపించాలని, ములుగు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సహకరించాలని ములుగు పట్టణ ప్రజలకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. 2023 శాసన సభ ఎన్నికల్లో తనను ఎలాగైతే భారీ మెజారిటీతో గెలిపించి రాష్ట్రానికి మంత్రిని చేశారో అలాగే ములుగు మున్సిపల్‌కు మొదటిసారి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులందరినీ గెలిపించి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని మంత్రి సీతక్క అన్నారు ఇప్పటికే పట్టణానికి రూ.50 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తిచేశామని, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని మంత్రి సీతక్క కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి, పంచాయతీరాజ్ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి. కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్సార్ ఖాన్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పల్లె జైపాల్ రెడ్డి, ‘ఆత్మ’ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సేద సారంగం, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, జిల్లా నాయకులు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




