– బీఆర్ఎస్‌పై మంత్రి సీతక్క ఫైర్
– అంగన్‌వాడీలకు మొబైల్ ఫోన్ల పంపిణీ
కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: అంగన్‌వాడీలకు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లలో అవకతవకలు అంటూ బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హితవు పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేంద్రం ఆధŠ్వర్యంలోని జెమ్ పోర్టల్‌లో అత్యంత పారదర్శకంగా టెండర్ ప్రక్రియ ద్వారా మొబైల్ ఫోన్ల కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. రెండుసార్లు టెండర్లు పిలిచామని, రూ.14,999లకు ఫోన్లు కొనుగోలు చేసినట్లు కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే టీజీ టీఎస్ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిందని చెప్పారు. రూ.11,800 గరిష్ఠ ధరకు మొబైల్ కొనుగోలు చేయాలని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ తాము అంతకన్నా తక్కువకే రూ.11,650కే కొనుగోలు చేశామని చెప్పారు. దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్న దుర్మార్గులను కేసీఆర్ అదుపులో పెట్టాలని, లేకపోతే మీకే నష్టం అని చెప్పారు. ఆడబిడ్డల మీద తప్పుడు ప్రచారం చేయడం దారుణమని, నిజంగా మీ వద్ద ఆధారాలుంటే కేంద్రానికి ఫిర్యాదు చేయండి.. కోర్టులకు వెళ్లండి అని సూచించారు. తప్పుడు ఆరోపణలు చేస్తే లీగల్ నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. గతంలో ఇసుక తవ్వకాల విషయంలో టీఆరఎస్‌కు లీగల్ నోటీసులు ఇస్తే అప్పుడు విచారం వ్యక్తం చేశారు.. ఇప్పుడు కూడా తప్పుడు ఆరోపణలు మానుకోకపోతే లీగల్ చర్యలు తప్పవు అని అన్నారు. అయిదేళ్ల కిందట అంగన్వాడీలకు రూ.10 వేలకు మీరు ఫోన్లు కొనుగోలు చేశారు.. ఇప్పుడు ధరలు పెరిగాయి.. అడ్వాన్స్‌డ్ మొబైల్స్.. నిజంగా తక్కువ ధరకే మొబైల్స్ వస్తే మీరెందుకు ఓపెన్ టెండర్లల్లో పాల్గొనలేదని ప్రశ్నించారు. టెండర్లలో పాల్గొనకుండా ఇప్పుడు ఆరోపణలు చేయడం దుర్మార్గం అని అన్నారు. ఆడబిడ్డలకు అత్యాధునిక మొబైల్స్ ఇస్తే ఎందుకు నిప్పులు సోసుకుంటున్నారు అని మంత్రి సీతక్క నిలదీశారు.
——————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



