ఆటో డ్రైవ‌ర్ల ప్ర‌మాద బీమా నేనే క‌డ‌తా

– రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ఆటోడ్రైవ‌ర్ల‌కుకేటీఆర్ హామీ
– ప్ర‌తి డ్రైవ‌ర్‌కు ప్ర‌భుత్వం రూ.24వేలు బాకీ

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17:  కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రైవర్ల అందరికీ రూ.5 లక్షల  ప్రమాద బీమా కోసం అవసరమైన ప్రీమియంను తానే చెల్లిస్తానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.  రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆటో డ్రైవర్లతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు (కేటీఆర్‌) సోమవారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత కేసీఆర్‌ ప్రభుత్వం ఆటో కార్మికులకు అండగా ఉన్నదని గుర్తు చేస్తూనే, ప్రస్తుత ప్రభుత్వం డ్రైవర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక, వారి సంక్షేమానికి చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. రూ. 5 లక్షల బీమాను రద్దు చేసి ఆటో అన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేసింద‌న్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం అసంఘటిత రంగంలోని డ్రైవర్లందరికీ, కేవలం ఆటో డ్రైవర్లకే కాకుండా, రైతు బీమా తరహాలోనే రూ. 5 లక్షల ప్రమాద బీమా (యాక్సిడెంట్ ఇన్సూరెన్స్) అమలు చేసిందని ఆయ‌న గుర్తు చేశారు. దురదృష్టవశాత్తూ ఎవరికైనా ప్రమాదం జరిగితే ఈ బీమా ద్వారా చాలామందికి డబ్బులు అందాయని తెలిపారు. అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన అక్టోబర్లో ఈ బీమా ప్రీమియంను కట్టకపోవడంతో, ఆటో కార్మికులు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి డ్రైవర్‌కు రూ.24,000 కాంగ్రెస్ బాకీ ప‌డింద‌న్నారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు నెలకు రూ. 1,000 చొప్పున సహాయం చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. రెండేళ్లకు కలిపి ప్రతి ఆటో డ్రైవర్‌కు ప్రభుత్వం రూ.24,000 బాకీ ఉంది. ముందు ఆ బాకీ కట్టండి అని డిమాండ్ చేశారు. అంతేకాక 100 రోజుల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సంక్షేమ బోర్డును కూడా రెండేళ్లు అవుతున్నా ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వానికి డ్రైవర్ల పట్ల ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్లు దాదాపు 5,000 మంది ఉన్నారు. వీరికి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టడం లేదు కాబట్టి పార్టీ తరపున వ్యక్తిగతంగా నేను కట్టిస్తానని కేటీఆర్ ప్రకటించారు. ఇలా తాము బీమా కట్టడం ద్వారా రాష్ట్రమంతటా ప్రభుత్వానికి సిగ్గు వచ్చి వీళ్లు కడుతున్నప్పుడు మనం ఎందుకు కట్టొద్దు అని బీమా కట్టే ఆలోచన వస్తుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నానని ఆయన వివరించారు. జిల్లాలోని ఆటో, ఏడు సీట్ల (సెవెన్ సీటర్స్), అవసరమైతే ట్రాలీ డ్రైవర్లందరి వివరాలను (పేరు, ఫోన్ నంబర్, ఆధార్ నంబర్) సేకరించి బుధవారం సాయంత్రంలోగా అందజేయాలని కేటీఆర్ అక్కడి నాయకులకు, ఆటో యూనియన్ల వారికి సూచించారు. ఈ లిస్ట్ అందిన వెంటనే మూడు, నాలుగు రోజుల్లోనే బీమా చెల్లింపునకు చెక్కులు పంపిస్తానని హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page