Attendance : హాజరు నిబంధనల్లో కోర్టుల జోక్యం లేదు

–  హైకోర్టు స్ప‌ష్టీక‌ర‌ణ

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌ ఆగస్టు 6: హాజరు శాతం(attendance percentage)  నిబంధనల విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు (High court) తేల్చి చెప్పింది. యూనివర్సిటీ నిబంధనలను కోర్టులు తిరిగి రాయలేవని స్పష్టం చేసింది. పరీక్షలు రాయడానికి అవసరమైన హాజరు శాతం నిర్ణయాన్ని యూనివర్సిటీలు రూపొందిస్తాయని, ఇంజనీరింగ్‌ కోర్సు సాంకేతిక వ్యవహార అంశమని పేర్కొంది. ప్రాక్టికల్, థియరీ తరగతుల ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిబంధనలు రూపకల్పన ఉంటుందని అభిప్రాయపడింది. సాధారణంగా 75 శాతం హాజరు అవసరమని, అనారోగ్యం, క్రీడలు, ఎన్సీసీ వంటి ప్రత్యేక పరిస్థితుల్లో 10 శాతం మినహాయింపు వరకే అవకాశం ఉంటుందని, దీనికి మించి అనుమతించేందుకు వీల్లేదనే నిబంధనలను గుర్తు చేసింది. హాజరు తక్కువగా ఉన్న విద్యార్థి నిర్ధిష్ట విద్యా సంవత్సరంలోగా సెమిస్టర్‌ పూర్తి చేయాల్సిందేనని వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన కె.మాన్విత అనారోగ్యంతో హాజరు శాతం తక్కువగా ఉన్న కారణంగా బీటెక్‌ మూడో సంవత్సరం 2వ సెమిస్టర్‌ పరీక్షలకు అనుమతించాలని సింగిల్‌ జడ్జి గతంలో ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని గీతాంజలి కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (అటానమస్‌) (Geetanjali college of Engineering and Technology) అప్పీల్‌ దాఖలు చేసింది. చీఫ్‌ జస్టిస్‌ ఆపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. యూనివర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇలాంటివి అనుమతిస్తే విద్యార్థులందరూ ఇదే తరహా అభ్యర్థనలతో కాలేజీకి రాకుండా పరీక్షలకు అనుమతించాలని కోర్టులకు వస్తారని తెలిపారు. ప్రస్తుతం పిటిషనర్‌తో పాటు హాజరు తక్కువగా ఉన్న అయిదుగురిని పరీక్షలకు అనుమతించలేదన్నారు. విద్యార్థి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అనుమతించాలని కోరారు. మేఘాలయ హైకోర్టుతో పాటు ఇతర హైకోర్టులు ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుని నిర్ధిష్ట కారణాలతో కాలేజీకి వెళ్లలేకపోయిన విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, జీవితంలో ఎన్నో ఒడిదుడికలు ఎదురౌతుంటాయని, అనేక అడ్డంకులు వస్తుంటాయని, వీటిని దీటుగా ఎదుర్కొని పరీక్షలకు హాజరుకాలేకపోతే ఎలాగని ప్రశ్నించింది. యుపీఎస్సీ తదితర పోటీ పరీక్షల్లో కూడా మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులు కాలేనివారు చాలా మందే ఉంటారని, ఆ తర్వాత ప్రయత్నాలు చేసి అగ్రస్థానంలో నిలిచిన వారు ఉన్నారని గుర్తు చేసింది. అనారోగ్యం కారణంగా విద్యార్థిని పరీక్షలకు అనుమతిస్తే రేపు మరొకరు ఇలాగే ప్రత్యేక కారణాలతో కాలేజీ, యూనివర్సిటీ నుంచి వచ్చే అవకాశం ఉండే ప్రమాదం లేకపోలేదని చెప్పింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి ప్రారంభమయ్యే మూడో సంవత్సరం 2వ సెమిస్టర్‌లో జూనియర్‌ విద్యార్థులతోపాటు చదవాలని చెప్పింది. అప్పీల్‌ను అనుమతించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *