– రియల్ ఎస్టేట్ అవసరాల కోసం వాడటం దారుణం
– ల్యాండ్ స్నాచర్‌గా మారిన ప్రభుత్వం
– కేంద్రం కఠినంగా వుంటే ఇటువంటివి జరగవు
– ఉర్దూ యూనివర్సిటీకి అండగా వుంటాం
– పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తుతాం
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 9: హైదరాబాద్ తలమానికంగా దేశంలో ఉన్న ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బంజారాహిల్స్ నంది నగర్ నివాసంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో శుక్రవారం ఆయన సమావేశమైనారు. విశిష్టమైన యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం కాంగ్రెస్ వాడాలనుకోవడం దారుణమన్నారు. 50 ఎకరాల యూనివర్సిటీ భూమిని అక్రమంగా తీసుకోవాలని చూస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం సీరియల్ కిల్లర్ల మాదిరి సీరియల్ ల్యాండ్ స్నాచర్ గా మారిందని అన్నారు. అన్ని యూనివర్సిటీ భూములను గుంజుకోవడం ఒక ప్రక్రియగా పెట్టుకుందన్నారు. ముందుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని హైకోర్టు పేరిట తీసుకున్నది. 400ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గుంజుకునే ప్రయత్నం చేసింది. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. విద్యార్థుల ఆందోళన… ప్రజల వ్యతిరేకత, సుప్రీమ్ కోర్ట్ జోక్యం వల్ల తాత్కాలికంగా ఆగింది. ఈ వ్యవహారంలో రూ.10వేల కోట్ల కుంభకోణం జరిగిందని సుప్రీంకోర్టు చెప్పిన ఇప్పటిదాకా కేంద్రం ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు.సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ భూములపై కన్ను వేసేది కాదన్నారు. ఈ ప్రభుత్వం విద్యా సంస్థల భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా వ్యవహరిస్తున్నదన్నారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి తమ పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం కోసం ఢిల్లీలో పోరాటం చేయాల్సి వస్తే అండగా ఉంటామన్నారు. ఈ అంశాన్ని అవసరమైతే రాజ్యసభలో పార్టీ పార్లమెంట్ సభ్యులు లేవనెత్తుతారన్నారు. యూనివర్సిటీ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను వేయడం ఏమాత్రం మంచిది కాదన్నారు. తాజాగా అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన ఐఎస్ బి భూములను కూడా గుంజుకునే కుట్ర ప్రారంభించిందన్నారు.
రాహుల్ మొహబ్బత్ కి దుకాణం అని చెప్తున్నది ఇదేనా?
దేశంలో మైనార్టీల సంరక్షకుడిని అని చెప్పుకునే రాహుల్ గాంధీ ఉర్దూ యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయడమే కాపాడడమా అంటూ ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్న మైనార్టీ విద్యార్థుల యూనివర్సిటీని నిర్వీర్యం చేయడమే మీ సంరక్షణా అంటూ నిలదీశారు. రాహుల్ గాంధీ మొహబ్బత్ కి దుకాణం అని చెప్తున్నది ఇదేనా? విద్యా సంస్థల భూములు తీసుకుని విద్యార్థులను రోడ్డుమీద వేయడమేనా? సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న సమస్యల పైన రాహుల్ గాంధీ మాట్లాడాలి.. కానీ వారి భూములు గుంజుకుంటున్న తమ ప్రభుత్వం పైన స్పందించకపోవడం దారుణం. యూనివర్సిటీలో ఉన్న భూములు ఖాళీ ఉన్నవి కావు భవిష్యత్తు విస్తరణ కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిష్టను తగ్గించేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదన్నారు. గతంలో ఇదే యూనివర్సిటీ ప్రజావసరాల కోసం హైదరాబాద్ నగరం కోసం 32 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఇచ్చారు. కాజాగూడ నుంచి నానక్ రామ్ గూడకు లింక్ రోడ్డు కోసం ఏడెకరాల స్థలాన్ని యునివర్సిటీ భూమి ఇచ్చింది. ఏనాడు కూడా హైదరాబాద్ నగర ప్రయోజనాల కోసం ప్రజాప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు భూసేకరణను వ్యతిరేకించలేదు. గతంలో తెలంగాణలో జరిగిన ఉద్యమం వల్లనే హైదరాబాదులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పడింది. తెలంగాణ ఉద్యమాలు త్యాగాల ఆధారంగా ఏర్పడిన యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ కోసం వాడడం దారుణం. గతంలో తాము నిజాం కాలేజీలో హాస్టల్ లేదు అంటే ప్రభుత్వ నిధులతో హాస్టల్ కట్టించామని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీకి అండగా ఉంటాము.. కావలసిన విస్తరణ సౌకర్యాలకు నిధులు కూడా కేటాయించి అండగా నిలబడతామన్నారు.
నిరుద్యోగులపై లాఠీచార్జ్ దారుణం
నోటిఫికేషన్లు ఏవి అని నిలదీసినందుకు నిరుద్యోగులను దారుణంగా తిడుతూ ఘోరంగా లాఠీఛార్జ్ చేశారని కేటీఆర్ అన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందుకు రాహుల్ గాంధీ ఫోజు కొట్టిండు. కెసిఆర్, కేటీఆర్ ఉద్యోగాలు తీస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు చెప్పారు? రాహుల్ గాంధీ విద్యార్థులతో మాటముచ్చట పెట్టి ఉద్యోగాల పేరుతో మోసం చేసింది నిజం కాదా? రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ అంశం పైన స్పందించి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఈరోజు విద్యార్థుల పైన పోలీసులతో దాడులు చేయిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బట్టల దుకాణం, సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి రేవంత్ రెడ్డి పోతున్నాడని విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు. నిన్నటి నుంచి ఆరేడు పోలీస్ స్టేషన్లు తిప్పి విద్యార్థులను, నిరుద్యోగ యువకులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిరుద్యోగుల వెంట, యువత వెంట తమ పార్టీ, తమ విద్యార్థి విభాగం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





