పోడు భూముల్లో మొక్క‌లు నాటే య‌త్నం

– అట‌వీ అధికారుల‌ను అడ్డుకున్న గిరిజన రైతులు
– మంత్రులు సీతక్క, సురేఖల మధ్య అంతర్గత పోరు

ములుగు, ప్రజాతంత్ర ఫిబ్రవరి 3:ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు పోడు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .మంగళవారం ఉదయం 10 గంటలకు తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో సింగారం రేంజ్ దూదేకులపల్లి పోడు భూములలో ఫారెస్టు అధికారులు బీట్ ఆఫీసర్ రమేష్ సీతారామ్ నాయక్, రేంజ్ ఆపిసర్ తోపాటు 13మంది ఆదర్యంలో జేసీబీ తీసుకుని వచ్చి పోడు భూములలో సుమారు 160 ఎకరాలలో 25 ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములలో మొక్కలు నాటేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని రైతులు తీవ్రస్థాయిలో అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాల్వపల్లి గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులు మధ్య ఘర్షణ జరిగింది . ఈ సందర్భంగా విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, ఆదివాసీ సేన ములుగు జిల్లా కన్వీనర్ ఆలం శ్రీను మాట్లాడారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములలో ఎలా మొక్కలు నాటుతారని ప్రశ్నించారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగు చేసిన భూములను వదిలేసి కొత్తగా సాగు చేస్తున్న భూములపై మాత్రమే చర్యలు తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదు అన్నారు. గిరిజన చట్టాలను అతిక్రమించి అటవీ అధికారులు వ్యవహరించడం సరికాదన్నారు.

మంత్రుల మధ్య వైరం

ములుగు ఎమ్మెల్యే శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖల మధ్య వైరమే గిరిజన రైతులకు శాపంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.గతంలో సీతక్క తో పాటు కాంగ్రెస్ నాయకులు గిరిజన రైతులు సాగుచేసుకుంటున్న భూములపై హక్కులు కల్పిస్తామని , కొత్తగా సాగు చేస్తే ఊరుకునేది లేదని చెప్పినా మంత్రుల మధ్య మనస్పర్ధలే ఇలాంటి సమస్యలకు కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల మధ్య జరుగుతున్న వివాదాలు బయటకు రాకున్నా సత్సంబంధాలు లేకపోవడంతో వారిని నమ్ముకున్న నాయకులు, రైతులు, ప్రజలు నలిగిపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల మేడారం మహా జాతర జరిగిన సందర్భంలోనూ మంత్రులు సీతక్క , సురేఖల మధ్య సత్సంబంధాలు లేవనే విషయం స్పష్టమైందని పలువురు చర్చించుకుంటున్నారు. దీంతో అటవీ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ తన శాఖ అధికారులను అటవీ భూములను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో అటవీ శాఖ అధికారులు మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న తాడువాయి ప్రాంతంలో గిరిజన రైతులు పోడు చేసి సాగు చేసుకుంటున్నా భూములపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఉద్రిక్త పరిస్థితులు చల్లారేనా? 

తాడ్వాయి మండలంలో గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి దాడులు జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు అటవీ అధికారులు పోడు చేసుకుంటున్న రైతుల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు ప్రయత్నించడం దానికోసం జెసిబి లతో భూములను చదును చేసి మొక్కలు నాటే ప్రయత్నం చేయడంతో అధికారుల తీరుపై స్థానిక గిరిజన రైతులు అడ్డుకుంటూ ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు కల్పించడం చేయాలని అడ్డుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో అటవీ అధికారులు, గిరిజన రైతుల మధ్య జరుగుతున్న కొట్లాట ఎప్పటికీ చల్లారుతుందననేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొప్పుల కార్తిక్, తాటి గంగమ్మ, రమేష్, గ్రామ పెద్ద చీమల రాజు ,గౌతమ్ భద్ర, హిడ్మా రవి ,నరేష్, శ్రీను మహిళా సంఘం సభ్యులు లక్ష్మీ, మంజుల, సమ్మక్క, సారక్క, నాగక్క తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *