దాడులకు ప్రతిదాడులు తప్పవు

– రౌడీయిజం చేస్తోన్నకాంగ్రెస్‌
– కామారెడ్డి జిల్లా బాధితులకు కేటీఆర్‌ పరామర్శ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: గ్రామాల్లో కాంగ్రెస్‌ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌ జిల్లా సోమార్‌పేట్‌లో కాంగ్రెస్‌ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్‌ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ అభ్యర్థి బిట్ల బాలరాజు, అతని భార్య గంజి భారతిని కేటీఆర్‌ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ధైర్యం చెప్పి వైద్య ఖర్చులు పార్టీనే భరిస్తుందని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ గూండాలు దాడులకు తెగబడుతుంటే పోలీసులు నిశ్చేష్టులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోకపోతే తిరగబడాల్సి వస్తుందని, ఇక దాడికి ప్రతిదాడే సమాధానం అనుకుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, అప్పుడు జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. డీజీపీ స్థాయి నుంచి కిందిస్థాయి పోలీస్‌ అధికారుల వరకు అందరికీ గుర్తు చేస్తున్నా.. విూకు జీతాలు ఇస్తున్నది ప్రజల సొమ్ముతోనే. రేవంత్‌ ఇంట్లో సొమ్ముతోనోే, కాంగ్రెస్‌ సొమ్ముతోనో కాదు అని అన్నారు. భారతి, బాలరాజులపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వారి కుటుంబాని ఆర్థిక సహాయం, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రెండేండ్లుగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తకలపై కాంగ్రెస్‌ నాయకులు దాడులకు పాల్పడుతున్నారంటూ సూర్యాపేట, నల్లగొండలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై దాడి చేసి మూత్రం తాగించారని, మొదటి విడత పంచాయతీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ కార్యకర్త మల్లయ్య యాదవ్‌ను కాంగ్రెస్‌ గూండాలు హత్య చేశారని, మరో బీసీ సోదరుడి భార్య నామినేషన్‌ వేస్తే అతడిని కిడ్నాప్‌ చేసి కోమటిరెడ్డి అనుచరులు చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. ఇన్ని అరాచకాలు జరిగినా పోలీసులు ఇప్పటికీ కేసు నమోదు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటున్నామని, పోలీసులు డ్యూటీ సరిగ్గా చేయకపోతే తామే డ్యూటీ చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, దాడికి తెగబడ్డ కాంగ్రెస్‌ గూండాలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే డీజీపీ, ఎస్పీ కార్యాలయాల ముట్టడికైనా పిలుపునిస్తామన్నారు. న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు. సీఎం తన భాషతో కార్యకర్తలను రెచ్చగొట్టడం మానుకోవాలని, జరగబోయే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి వస్తుందని కేటీఆర్‌ అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *